అగ్నిగుండంలా మారిన అగ్రరాజ్యం..

నల్లజాతి నిరసనలతో అగ్రరాజ్యం అట్టుడుకుతోంది. గత వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మే25న తెల్లజాతి పోలీస్ చేతిలో నల్లజాతీయుడు చనిపోవడంతో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. మృతుడి స్వరాష్ట్రం మిన్నెసోటాలో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు దేశంలోని మరో 20 రాష్ట్రాలకు విస్తరించాయి. దాదాపు 52 ఏళ్ల తరువాత మళ్లీ ఈ పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
1968లో మార్టిన్ లూథర్ కింగ్ దారుణ హత్యకు గురైన సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఐదు దశాబ్దాల తరువాత మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది. జాత్యహంకారంపై జనాగ్రహం కట్టలు తెంచుకుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య పహారా కాస్తున్న అధినేత నివసిస్తున్న శ్వేత సౌధాన్ని వారు వదిలిపెట్టలేదు. ఆ భవన సమీపంలోని భవనాలను రాళ్లు విసురుతూ ధ్వంసం చేశారు.
నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించినా ఫలితం కనబడట్లేదు. దీంతో శ్వేతసౌధం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అధ్యక్షుడు ట్రంప్‌ను సురక్షిత ప్రాంతమైన బంకర్‌లోకి తరలించింది. ఈ పరిస్థితుల్లో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దింపుతామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com