సుప్రీంకోర్టుకు చేరిన నిమ్మగడ్డ రమేష్ వివాదం

సుప్రీంకోర్టుకు చేరిన నిమ్మగడ్డ రమేష్ వివాదం
X

ఏపీలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో జనంలో కలుగుతున్న సందేహాలు. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఏపీలో ఎన్నికల కమిషనర్‌ తానే అంటూ రమేష్‌ కుమార్‌ ప్రకటించుకున్నారు. ఎస్‌ఈసీ హోదాలో వివిధ విభాగాల అధికారులకు లేఖలు కూడా రాశారు. అయితే...ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం పంతం నెగ్గించుకునేందుకు అసలు వెనక్కి తగ్గటం లేదు. ఆయన్ను ఎస్‌ఈసీగా గుర్తించేందుకు ఓ పట్టాన ఒప్పుకోని ప్రభుత్వం..ఆటంకాలు సృష్టిస్తూనే ఉంది. హైకోర్టు తీర్పును అమలు చేయకపోవటం కోర్టు ధిక్కారమే అని హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ ను పక్కకు తప్పించేందుకు అవకాశమున్న అన్ని ప్రయత్నాలను చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఏపీలో ఎస్‌ఈసీ ఎవరూ అనేది జనంలో ఆయోమయం నెలకొంది.

రమేష్‌ కుమార్‌ ఎస్‌ఈసీ గుర్తించకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వం..ఈ వివాదంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపుతో పాటు అర్హతలను మార్చుతూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ను హైకోర్టు కొట్టివేయటంపై సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్ పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పులో ఓ అంశాన్ని లాజికల్‌ గా వినియోగించుకుంటోంది ప్రభుత్వం. ఎన్నికల కమిషనర్‌ ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న అంశాన్నే ఆసరాగా చేసుకొని నిమ్మగడ్డకు చెక్‌ పెట్టాలని చూస్తోంది. ఎన్నికల కమిషనర్‌ ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకుంటే..ఆనాడు నిమ్మగడ్డను నియమించింది కూడా రాష్ట్ర ప్రభుత్వమేనని..అంటే ఆయన నియామకం చెల్లదనే లాజిక్‌ పాయింట్ సంధిస్తోంది. అయితే.. ఎన్నికల కమిషనర్‌ నియామకం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ప్రస్తుతం సుప్రీం కోర్టు ముందు ప్రభుత్వం వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తమ వాదన నెగ్గితే కనగరాజు నియామకానికి మార్గం సుగమం అవుతుంది. అలా కాకుండా హైకోర్టు తీర్పునే సుప్రీం కోర్టు కూడా సమర్ధిస్తే..మళ్లీ నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదించే అవకాశాలు లేకపోలేదు.

స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ కావటంతో సుప్రీం కోర్టులో నేడో..రేపో ఏపీ ఎస్‌ఈసీ వివాదంపై వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అటు ఇప్పటికే ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేత మస్తాన్‌ వలి కేవియట్‌ దాఖలు చేశారు. అయితే..సుప్రీం కోర్టులోనూ ప్రభుత్వానికి టెక్నికల్‌ గా ఇబ్బందులు ఎదురవ్వొచ్చని అంటున్నారు లీగల్‌ ఎక్స్‌ పర్ట్స్‌. ఎస్‌ఈసీగా రమేష్‌ కుమార్‌ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న తీర్పుపై హైకోర్టుకు ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. రమేష్‌ కుమార్‌ విషయంలో తీర్పు అమలుపై స్టే ఇవ్వాలంటూ లేఖలో కోరింది. దీంతో హైకోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవాలనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే..ఇది రాజ్యాంగ బద్ధమైన కీలక పదవికి సంబంధించిన కేసు కావటంతో విస్తృత విచారణకు అవకాశం ఉండొచ్చని కూడా చెబుతున్నారు.

Tags

Next Story