మంగళసూత్రాన్ని కుదువ పెట్టి భర్త అంత్యక్రియలు పూర్తి చేసిన మహిళ

మంగళసూత్రాన్ని కుదువ పెట్టి భర్త అంత్యక్రియలు పూర్తి చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. కోవిడ్-19 విధుల్లో పాల్గొంటూ దురదృష్టవశాత్తు అంబులెన్స్ డ్రైవర్ మరణించారు.. దాంతో అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఆయన భార్య తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టింది. అనంతరం వచ్చిన డబ్బుతో అంత్యక్రియలు పూర్తి చేసింది. గదగ్ జిల్లా కొన్నూర్‌కు చెందిన ఉమేష్ హదగలి, జ్యోతి దంపతులు.. వారికి ఇద్దరు సంతానం.. ఉమేష్ అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. గత రెండు నెలలుగా కోవిడ్-19 విధుల్లో రేయింబవళ్లు పనిచేస్తూ ఇటీవల గుండెపోటుతో మరణించారు. అప్పటికే వారి కుటుంబం పేదరికంతో మగ్గిపోతోంది.
ఈ క్రమంలో భర్త అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఆయన భార్య జ్యోతి తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి ఎదురైంది. ఇద్దరు సంతానం కలిగిన తమకు ప్రభుత్వం ఎలాంటి సాయం అందలేదని విసిగిన జ్యోతి తమ దుస్థితి గురించి ప్రభుత్వానికి తెలిసేలా ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అంతేకాదు ఈ వీడియోను చూసిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తక్షణమే స్పందించారు. ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. ఉమేష్ మృతికి బీమా వచ్చేలా చేయడం తోపాటు పరిహారం అందచేస్తామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

