ఏయూ దళిత ప్రొఫెసర్‌కు అవమానం.. ప్రభుత్వంపై లోకేష్ ఫైర్

ఆంధ్రాయూనివర్సిటీలో రాజుకున్న కుల వివక్షపై రాజకీయ దుమారం మొదలైంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వరుస దాడుల పట్ల సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మొన్న హర్షకుమార్ అరెస్ట్..ఆ తర్వాత డాక్టర్ సుధాకర్ పై వేధింపులు..ఇప్పుడు ఏయూ ప్రొఫెసర్ ప్రేమానందానికి అవమానాలు. దీనికితోడు దళితుల భూములను కూడా లాక్కుంటున్న దారుణాలు. ఇలా దళిత గొంతును నిరంకుశంగా తొక్కుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షం మండిపడుతోంది.
ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రేమానందం ఇటీవలె వర్సిటీలో ఓ వర్క్ షాప్ నిర్వహించారు. 7 రాష్ట్రాలకు చెందిన దళిత విద్యార్ధులు ఇందులో పాల్గొన్నారు. అయితే..ఆ వర్క్ షాప్ తాలుకు నిధుల జాప్యంపై ప్రశ్నించినందుకే తనను వర్సిటీ రిజిస్ట్రార్ అవమానించారని ప్రొఫెసర్ ప్రేమానందం ఆరోపిస్తున్నారు.
రిజిస్ట్రార్ తీరుపై మండిపడుతున్న దళిత సంఘాలు ప్రొఫెసర్ ప్రేమానందానికి మద్దుగా ఆందోళనకు దిగాయి. కుల వివక్ష చూపిస్తున్న రిజిస్ట్రార్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దళిత సంఘాల నేతలు.
ఆంధ్రా వర్సిటీలో దళిత ప్రొఫెసర్ ప్రేమానందానికి జరిగిన అవమానంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మాస్కులు లేవని అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను ఉగ్రవాది కంటే ఘోరంగా హింసించారంటూ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. చివరికి దళితుల భూములను కూడా వదలటం లేదని, దళితులకు ఉపాధి కల్పించే లిడ్ క్యాప్ భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. కుచ్చులూరు బోటు ప్రమాదానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించనందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. ఇక ఇప్పుడు దళిత ప్రొఫెసర్ ప్రేమానందాన్ని కులం పేరుతో అవమానించారని..ఆయన్ని అవమానించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. అణగారిన వర్గాల వారిని వేధించటమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

