130 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు దూసుకొస్తోన్న అతిపెద్ద తుపాన్..

130 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు దూసుకొస్తోన్న అతిపెద్ద తుపాన్..
X

సూపర్‌ సైక్లోన్‌ ఆంఫన్‌ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుపాను దూసుకోస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను మహారాష్ట్ర, గుజరాత్‌లపై విరుచుకుపడ నుంది. జూన్ 3వ తేదీన ముంబైకి సమీపంలో తుపాన్ తీరం దాటనుంది. మహారాష్ట్రలోని రాయ్‌గర్ జిల్లా హరిహరేశ్వర్, డామన్ మధ్య తుపాన్ తీరం దాటే అవకాశముంది. సైక్లోన్ తీరం దాటే సమ యంలో భయంకరమైన గాలులు వీస్తాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లపై సైక్లోన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గోవాపై కూడా మోస్తరు స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుంది. సైక్లోన్ నేపథ్యంలో గుజరాత్,మహారాష్ట్ర, గోవాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు పంపించారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు.

అరేబియా సముద్రంలో చిన్నగా మొదలైన అల్పపీడనం అలా అలా పెరుగుతూ ఇప్పుడు రెండు రాష్ట్రాలను వణికించేంత పెద్దదిగా మారింది. ముఖ్యంగా, ముంబై మహానగరాన్ని సైక్లోన్ తీవ్రంగా దెబ్బ తీస్తుందని అంచనా వేస్తున్నారు. తుపాన్ కారణంగా భారీ నుంచి అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. శతాబ్దకాలంలో ముంబై మహానగరాన్ని తాకనున్న రెండో అతిపెద్ద తుపానుగా నిసర్గను పేర్కొంటున్నారు. 1891 జూన్‌లో చివరిసారిగా ముంబైని తుపాన్ ముంచెత్తింది. 130 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తుపాన్ దూసుకొస్తోంది.

వేసవి కాలం ముగింపు దశలో అంటే నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించే జూన్ నెలలో ఇంతటి భీకరమైన తుఫాన్ 130 సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు తెలుస్తోంది. మళ్లీ ఇన్నేళ్లకు అలాంటి పరిస్థి తి వచ్చింది. 1948, 1980లలో మహారాష్ట్ర 2 సార్లు తుఫాన్లను ఎదుర్కొన్నప్పటికీ అవి ఇంత తీవ్రంగా లేవు. ఈ సారి మాత్రం గతానికి భిన్నంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్.. ట్రాపికల్ సైక్లోన్‌గా రూపుదిద్దుకుందని దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తరహా తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో ఒక్కసారిగా గాలుల్లో తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

సైక్లోన్ వార్నింగ్‌లతో గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అలర్టయ్యాయి. తీరప్రాంతాల ప్రజలనుసురక్షిత ప్రాంతాలకు తర లిస్తున్నారు. 39 NDRF బృందాలు 2 రాష్ట్రాల్లో సహాయ చర్యలు చేపట్టాయి. కేంద్ర హోంశాఖ కూడా కంటిన్యూగా సమీక్షిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో టచ్‌లో ఉంటూ సహాయ కార్యక్రమాల్లో తలమునకలైంది. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో మాట్లాడారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

Tags

Next Story