స్కూలెప్పుడు.. ఆన్‌లైన్ క్లాసు అంత బాగాలేదు..

రెండు నెలల పైగా కొనసాగిన లాక్డౌన్ అనంతరం దాదాపు అన్ని రంగాలు తెరుచుకున్నాయి. కానీ విద్యాసంస్థలు ప్రారంభించాలంటే తల్లిదండ్రులతో పాటు విద్యా సంస్థలూ భయపడుతున్నాయి. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాయి. అవి అంత మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో మరో మార్గం ఏంటనే దానిపై కేంద్రం దృష్టి సారించింది. జులైలో ఉన్నత పాఠశాలలు, ఆగస్టులో ప్రాథమిక పాఠశాలలు, డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కాలేజీలు ప్రారంభమవుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం జులై 15 తర్వాత స్కూళ్లు తెరిస్తే మంచిదనే అభిప్రాయంతో ఉంది. కానీ లాక్డౌన్ సడలింపులు, రవాణాసౌకర్యం అందుబాటులోకి రావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బడులు తెరిస్తే విద్యార్థులు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే రెండు నెలల్లో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఇక ఆన్‌లైన్ తరగతులపై విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఆసక్తి చూపడం లేదు. వైద్యులు కూడా ఆన్‌లైన్ విద్య అంత శ్రేయస్కరం కాదని అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించాలనేది కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com