శ్రీవారి దర్శన భాగ్యం జూన్ 11 తర్వాత.. ఎన్నో మార్పులు..

శ్రీవారి దర్శన భాగ్యం జూన్ 11 తర్వాత.. ఎన్నో మార్పులు..
X

కోవిడ్ వ్యాప్తిని అరికట్టే దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయాన్ని గత 75 రోజులుగా మాసి ఉంచారు. నిబంధనలు పాటిస్తూ ఆలయాన్నిజూన్ 11తర్వాత నుంచి తెరిచేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం టిటిడి ఆలయంలో పని చేసే ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. జూన్ 8,9 తేదీల్లో ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తారు. జూన్ 11న టిటిడి ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సామాజిక దూరాన్ని పాటిస్తూ ట్రయల్ రన్‌లో పాలు పంచుకుంటారు. దీనిని బట్టి భక్తులు ఎంత త్వరగా స్వామి వారిని దర్శించుకోవచ్చో అనేది ఒక అంచనాకు వస్తారు అని టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు.

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనభాగ్యం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల వారు, టిక్కెట్లు బుక్ చేసుకోలేని వారికోసం అలిపిరిలో రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. క్యూలలో నిలబడిన భక్తులు వీలైనంత వరకు రాడ్లను తాకకుండా ఉండాలని అన్నారు. ఎక్కడికక్కడ ఆటోమేటిక్ శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం కచ్చితంగా చేయాలని అన్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని అనుమతించరు. అలిపిరి చెక్‌పోస్ట్ వద్దే భక్తులందరినీ పరీక్షిస్తారు.

కంటైన్మెంట్ జోన్లలో నివసించే వారు శ్రీవారిని దర్శించవద్దని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. దాదాపు 10 వేల నుంచి 20 వేల మంది భక్తులు శ్రీవారిని ప్రతి రోజూ దర్శిస్తుంటారని, ఆ సమయంలో కోవిడ్ లక్షణాలు ఉన్నవారు దర్శిస్తే చాలా ప్రమాదమని ఆయన అన్నారు. ఇక పుష్కరిణి (కోనేరు) లో స్నానం చేయడానికి ఎవరికీ అనుమతి లేదు. స్నానం చేయడానికి ప్రత్యేక కుళాయిలు అందుబాటులో ఉంచామన్నారు. అన్నప్రసాద కాంప్లెక్స్ వద్ద కూడా సామాజిక దూరం అమలు చేయబడుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి భక్తులకు అనుమతి లేదు. పరిస్థితిని బట్టి వివిఐపి, బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తామని, దీని కోసం ఒకటిన్నర గంట మాత్రమే కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Tags

Next Story