బిగ్ బ్రేకింగ్.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ

పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు 4 రంగులు సరికాదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. అవి పార్టీ రంగులు కాదంటూ.. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ వాదించినా అది కోర్టులో నిలబడలేదు.
పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయంలో ఏపీ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నాలుగు రంగులను తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందుకు 4 వారాలు గడువిచ్చింది. ఈలోపు ఆ రంగులు మార్చకపోతే దాన్ని కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని తీవ్రస్థాయిలోనే వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ భవనాలకు రంగుల విషయంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కారు ఆ పార్టీ రంగుల్ని పోలిన రంగులనే పంచాయతీలకు వేసింది. హైకోర్టు వీటిని తొలగించాలని అప్పట్లోనే ఆదేశించింది. దీనిపై సుప్రీంకి వెళ్లినా అక్కడ కూడా ప్రభుత్వ వాదన నెగ్గలేదు. దీంతో.. CS నేతృత్వంలో కమిటీ రంగులపై చర్చించి నిర్ణయం తీసుకుంది. ఈసారి ఉన్న 3 రంగులకు అదనంగా మరో రంగును కూడా చేర్చారు. ఇందులో ఉన్న ఒక్కో రంగుకు ఒక్కో నిర్వచనం చెప్పారు. ఈ నాలుగు రంగులపై కూడా పిటిషన్లు దాఖలవడంతో హైకోర్టు మరోమారు విచారణ జరిపింది. చివరికి 4 రంగులపై ఇచ్చిన జీవోను రద్దు చేసింది. ఆ వెంటనే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది జగన్ సర్కార్. దీనిపై విచారించిన బెంచ్.. నాలుగు రంగులు సరికాదని స్పష్టం చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

