భాగ్యనగరంలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.. ఎప్పటినుంచంటే?

భాగ్యనగరంలో మళ్లీ సిటీ బస్ హారన్ వినిపించబోతోందా..? రెండున్నర నెలలుగా డిపోలకే పరిమితమైన లోకల్ బస్సులు.. నగర రోడ్లపై పరుగులు పెట్టనున్నాయా..? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. సిటీ, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు కేంద్రం అనుమతించిన నేపథ్యంలో.. జూన్ 8 నుంచి సిటీ బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. సాధ్యాసాధ్యాలపై రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. బుధవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పటికే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. జనం రోడ్లపైకి వస్తున్నారు. అయితే, ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామాలు రోజుల్లో నగరంలో రోజుకు దాదాపు 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. నగరంలో అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సొంత వాహనాలు లేని ప్రయాణికులు.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నారు. మరోవైపు బస్సులు లేకపోవడంతో ప్రయివేటు వాహనాలు భారీగా రోడ్డెక్కుతున్నాయి. దీంతో మళ్లీ ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణంగా మారిపోయాయి.
ఈ నేపథ్యంలో సిటీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది టీఎస్ ఆర్టీసీ. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పాటు అన్ని జాగ్రత్తలు పాటించి.. బస్సులను రోడ్డెక్కించాలని యోచిస్తోంది. భౌతిక దూరం, శానిటైజర్లు, మాస్కుల వాడకం తప్పనిసరి చేస్తూ.. సిటీ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే, కరోనా నిబంధనలు పాటిస్తూ డిస్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. అయితే, వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రస్తుతానికి అంతర్రాష్ట్ర సర్వీసులు నడపడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేనట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com