డాక్టర్ సుధాకర్ కేసులో మరో ట్విస్ట్

సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సుధాకర్‌తోపాటు పలువురిని విచారించిన సీబీఐ. డాక్టర్ సుధాకర్‌పై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. సెక్షన్ 353, 427, 506 కింద CBI అధికారులు F.I.R నమోదు చేశారు. సీబీఐ వెబ్‌సైట్‌లో F.I.R కాపీని అందుబాటులో ఉంచారు. కానిస్టేబుల్ బెలగల వెంకటరమణ ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిష్టర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు.. విధులకు ఆటంకం కలిగించారనే అంశంపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులపై సీబీఐ ఎస్పీ విమలాదిత్య వివరణ ఇచ్చారు. డాక్టర్ సుధాకర్‌పై కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని విమలాదిత్య స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును టేకోవర్ చేసినట్లు చెప్పారు. పోలీసులు గతంలో నమోదు చేసిన కేసులను సీబీఐ రీ-రిజిష్టర్ చేసినట్లు విమలాదిత్య వివరించారు.
మాస్కుల కొరతపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు నర్సీంపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అయితే మే 16న ఆయన విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం పోర్టు హాస్పిటల్ ఎదురుగా నడిరోడ్డుపై అర్ధ నగ్నంగా కనిపించడం సంచలనం సృష్టించింది. ఆయన్ను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదమైంది.. దుస్తులు ఊడదీసి అర్ధనగ్నంగా చేసి, తాళ్లతో చేతులను వెనక్కివిరిచి కట్టడం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో విషయం కోర్టుకు వెళ్లింది. విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశంతో రంగంలోకి దిగిన సీబీఐ... గత కొన్ని రోజులుగా ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఇప్పటికే సుధాకర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, ట్రీట్‌మెంట్ చేసిన KGH వైద్యులు, 4వ పట్టణ పోలీసు సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com