అమ్ముడుపోయే పంటలే సాగు చేస్తే.. వ్యవసాయం బాగుంటుంది: కేసీఆర్

మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనికోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈసారి ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తోందన్నారు. ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్‌లో కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని కేసీఆర్ చెప్పారు. రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అందరూ విజయవంతం చేయాలని సీఎం కోరారు.
నియంత్రిత పద్ధతిలో పంటల సాగు వ్యూహాన్ని ఖరారు చేయడం కోసం సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజులపాటు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు ఖచ్చితమైన అంచనాలు రూపొందించాలన్నారు. ఏ ప్రాంతానికి ఎలాంటి ఆహార పదార్థాల అవసరం ఉందో పరిశీలించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగాలని కేసీఆర్ ఆదేశించారు.
నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం నిరంతరం సాగాలన్నారు కేసీఆర్. దీనికోసం ప్రభుత్వం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కమిటీని నియమిస్తుందన్నారు. నిపుణులు, నిష్ణాతులను ఈ కమిటీలో నియమిస్తారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ – మార్కెటింగ్ – ధరలు తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. ఏ పంటలు వేయడం వల్ల లాభం కలుగుతుందో ఈ కమిటీ సూచిస్తుందని చెప్పారు. దాని ప్రకారం పంటల సాగు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com