జల వివాదాల పరిష్కారంపై కృష్ణా బోర్డు కీలక సమావేశం

కృష్ణాబేసిన్‌పై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య నెలకొన్న జలజగడానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కృష్ణాబోర్డు రంగంలోకి దిగింది. గురువారం జరిగే సమావేశానికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు హాజరుకావాలని బోర్డ్ ఇదివరకే సమాచారం పంపింది. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శులతో పాటు.. చీఫ్ ఇంజనీర్లు రావాలని చెప్పిన క్రిష్ణాబోర్డ్.. చర్చించాల్సిన ఎజెండాను సైతం సిద్దం చేసింది. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 40వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు పెంచడం... రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం KRMBకి ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటరీ సామర్ద్యం పెంచితే నదినే పూర్తిగా తరలించుకుపోయినట్లు అవుతుందని... శ్రీశైలం కింద తెలంగాణలో ఉన్న నాగార్జున సాగర్‌కు చుక్కనీరు కూడా రాదని... కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు కూడా ప్రశ్నార్థకంగా మారుతాయంటూ ఏపీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. వెంటనే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆపాలని... తెలంగాణను సంప్రదించకుండా ఎలా జీవో విడుదల చేశారంటూ సీఎం కేసీఆర్ తప్పుబడుతున్నారు.
తెలంగాణ అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వాన్ని బోర్డ్ వివరణ కోరింది. అయితే తమకు తెలంగాణలో కృష్ణాబేసిన్‌పై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అనుమానాలు ఉన్నాయని.. వాటి DPRలు కావాలంటూ ఏపీ సైతం.. బోర్డులో మరో ఫిర్యాదు చేసింది. తెలంగాణలో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్ని కూడా.. 800 అడుగులలోపే లిఫ్టులు ఉన్నాయని.. సమన్యాయం కోసం పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచుతున్నామని.. అది కూడా వరద జలాల కోసం తప్ప.. నికర జలాల కోసం కాదంటూ ఏపీ తమ వివరణలో పేర్కొంది. ఏపీలోని గత ప్రభుత్వంతో అపెక్స్ కౌన్సిల్ ఆమోద ముద్రతోనే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని.. అవి అక్రమం ఎలా అవుతాయంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.
పోతిరెడ్డిపాడును ప్రశ్నిస్తే.. తెలంగాణలోని ప్రాజెక్టులపై అనుమానాలు వ్యక్తం చేస్తారా అంటూ ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణానదిలో నీటివాట విషయంలో కొత్త అంశాలను బోర్డ్ ముందు పెట్టబోతోంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా పట్టుసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించాలని.. అప్పుడు నికర జలాలలో తమ రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని పట్టుబట్టబోతోంది. ప్రస్తుతం 811 TMCలలో తెలంగాణకు 299 టీఎంసిల నీటి వాట ఉంది. అయితే గోదావరి నీళ్లు కృష్ణానదిలో కలుస్తున్నాయి కాబట్టి.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం.. నికరణ జలాల్లో ఏపీకి వాటా తగ్గిస్తూ మరో 45 టీఎంసీలు రాష్ట్రానికి వాటా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డ్ ఎదుట ప్రతిపాదన పెట్టబోతోంది.
మరోవైపు బచావత్ ట్రిబ్యునట్‌లోని 7వ క్లాజ్ ప్రకారం తాగునీటి కోసం వాడుకుంటున్న జలాలను కేవలం 20 శాతంగా పరిగణలోకి తీసుకోవాలని మరో అంశాన్ని చర్చకు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇదిలా ఉంటే...ఈ ఏడాది సంవృద్ధిగా కురిసిన వర్షాలతో క్రిష్ణాబేసిన్ జలకళను సంతరించుకుంది. దీంతో నికరజలాలతోపాటు...వరద జలాలు తోడయ్యి... కృష్ణానది నీటి లభ్యత 920 టీఎంసీలుగా తేలింది. అధనంగా 109 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. వరద నీటిని 66:34 రేషియోలో పంపకాలు చేసిన బోర్డ్... ఏపీకి 647 టీఎంసీలు, తెలంగాణకు 333 టీఎంసీలుగా లెక్క తేల్చింది. ఇప్పటికే ఏపి తమకు కేటాయించిన నీళ్లను పూర్తి స్థాయిలో వాడేసుకుంది. అయితే తెలంగాణ రాష్ట్రం మాత్రం తమకు కేటాయించిన నీళ్లలో కేవలం 272 టీఎంసిలు మాత్రమే వాడుకోగలిగింది. అందుకే ఏపి ప్రభుత్వం ప్రస్తుతం వాడుకున్న అధనపు జలాలను వచ్చే ఏడాది కేటాయింపుల్లో తక్కువ చేయాలని... తమ రాష్ట్రానికి ఎక్కువగా వాడుకోనేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డ్ ఎదుట చర్చించనుంది. మరి రెండు రాష్ట్రాలు ఇంకా ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తుతాయో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com