తీరాన్ని తాకిన నిసర్గ తుపాన్..తప్పిన ముప్పు

ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న మహారాష్ట్ర నిసర్గ ముప్పు నుంచి తప్పించుకుంది. మహా ప్రమాదం నుంచి బయటపడింది. భయంకరమైన నష్టం కలగచేస్తుందనుకున్న నిసర్గ స్లైక్లోన్ ముప్పు తప్పటంతో ముంబైకర్లు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తుఫాన్ తీరం తాకడం మొదలైంది. బాంబేకి 100 కిలోమీటర్ల దూరంలోని అలీబేగ్ వద్ద సైక్లోన్ పూర్తిస్థాయిలో తీరాన్ని తాకింది. సైక్లోన్ తీరాన్ని తాకే టైంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయి.
తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. కొన్నిచోట్ల 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి. తుఫాన్ తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. పుణే, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, పాల్ఘర్, సింధు దుర్గ్ జిల్లాల్లో తుఫాన్ ప్రభావం కనిపించింది. ఈ జిల్లాల మీదుగానే తుఫాన్ ప్రయాణం కొనసాగింది. కుండపోత వానలతో ఇళ్లు, వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. అపార్ట్‌మెంట్ సెల్లార్లు నీటితో నిండిపోయాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలకు తీవ్ర విఘాతం కలిగింది. మహారాష్ట్రలో దాదాపు 4 జిల్లాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింఇ. తుపాను తీవ్రత ఊహించిన స్థాయిలో లేనప్పటికీ ప్రజలను ఇళ్లకే పరిమితం చేశా రు. ముంబై అంతటా 144 సెక్షన్ విధించి హై అలర్ట్ ప్రకటించారు.
నిసర్గ తుఫాన్ కారణంగా ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాత్రి 7 గంటల వరకు మూసివేశారు. అంతకుముందు ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి ముంబై చేరుకున్న ఫెడెక్స్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే తుఫాన్ గాలులు విమానాన్ని రన్ వే నుంచి పక్కకు నెట్టేశాయి. దీంతో విమానాల రాకపోకలను రాత్రి వరకు నిలిపివేశారు.
ముంబైతో పాటు గుజరాత్ లోని గుజరాత్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీల్లో కూడా తుఫాన్ బీభత్సం సృష్టించింది. ప్రచండ గాలులను తట్టుకోలేక మహావృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. సైక్లోన్ నిసర్గ ఎఫెక్ట్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ లో సహాయక చర్యల కోసం 43 ఎన్డీఆర్‌ఎఫ్ టీంలను రంగంలోకి దింపారు. రెండు రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా ప్రజ లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంబైలో 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. బాంద్రాలో తాత్కాలిక సెంటర్‌లో చికిత్స పొందుతున్న కరోనా పేషంట్లను ఇతర ప్రాంతాలకు పంపిం చారు. గుజరాత్‌లో తీర ప్రాంత జిల్లాల్లో 75 వేల మందిని సైక్లోన్ క్యాంపులకు పంపించారు. దక్షిణ గుజరాత్‌లోని పరిశ్రమలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు. తీరం దాటిన తర్వాత బలహీనపడిన తుపాను..ఇవాళ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com