ఎందుకలా చేశారు.. ఏనుగు ఎంత బాధపడి ఉంటుంది

ఎందుకలా చేశారు.. ఏనుగు ఎంత బాధపడి ఉంటుంది
X

మనుషులెంత మంచివారు.. తన కోసం పైనాపిల్ పండు ఇచ్చారనుకుని ఆనందంగా తింది కడుపులో బిడ్డను మోస్తున్న ఏనుగు. మరుక్షణంలోనే ఏనుగు నోట్లో పేలింది ఆ పైనాపిల్ బాంబు. నా చిట్టితల్లికి ఏమైందో అని అంత బాధలోనూ ఆరాట పడింది. గత నెల కేరళలో చోటు చేసుకున్న ఘటన మనుషుల్లో మానవత్వం నశించిపోతుందనడానికి నిదర్శనంగా మిగిలింది. గర్భంతో ఉన్న ఓ ఆడ ఏనుగు ఆహారం వెతుక్కుంటూ గ్రామంలోకి వచ్చింది.

తన దారిన తాను వెళుతుంటే గ్రామస్తులు పైనాపిల్ ఆశ చూపారు. అందులో పేలుడు పదార్థాలు పెట్టి దాని నోటికి అందించారు. ఆ విషయం తెలియని ఏనుగు ఆనందంగా పండును తిందామనుకుని నోట్లో పెట్టుకుంది. అంతే.. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పండు పేలింది. దాంతో ఏనుగు నోటి వెంట రక్తం కారుతున్నా.. తనను మోసం చేసిన మనుషులపై దాడి చేయకుండా గ్రామం వదిలి వెళ్లి పోయింది. కడుపులో బిడ్డ ఎలా ఉందో అని దిగులు, తగిలిన గాయంపై ఈగలు.. బాధ భరించలేక వెల్లియార్ నదిలోకి దిగింది.

గాయం కొంత తగ్గినట్లు కనిపించినా పైకి రాలేక ఆ నదిలోనే అలాగే నిలబడి పోయింది పగలూ రాత్రి. విషయం అటవీ అధికారులకు తెలియడంతో అటవీశాఖ సిబ్బంది ఏనుగును బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. ఏనుగు నదిలోనే ఉండిపోయింది. నాలుగు రోజుల అనంతరం మే 27 సాయింత్రం నదిలోనే కన్నుమూసింది. బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లి పోయింది.

ఈ హృదయ విదారక ఘటనను మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చనిపోయిన ఏనుగును బయటకు తీసిన తరువాత అది గర్భంతో ఉందని తెలిసి అటవీ శాఖ అధికారుల మనసు ద్రవించింది.

Tags

Next Story