ఏపీలో ఇళ్లస్థలాల పంపిణీలో వైసీపీ నేతల అక్రమాలు

ఏపీలో ఇళ్లస్థలాల పంపిణీలో వైసీపీ నేతల అక్రమాలు
X

ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీలో వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదలకు ఉచితంగా కేటాయించాల్సిన ఇళ్ల స్థలాలకు డబ్బులు వసూలు చేస్తున్నారు నేతలు. చేతివాటం చూపుతూ.. భూదందాలకు తెర తీస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే పోడూరు, పెనుగోండ మండలాల నుంచి పెద్ద ఎత్తున లబ్ధిదారుల నుంచి ఫిర్యాదు అందగా.. తాజా ఉండ్రాజవరం మండలంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కె. సావరం గ్రామంలో ఇళ్ల స్థలం అందజేయడానికి లబ్ధిదారుడి నుంచి ఏకంగా లక్షా 65వేల రూపాయలు వసూలు చేశారు స్థానిక వైసీపీ నేతలు.

సావరం గ్రామంలో మూర్తి రాజు అనే వ్యక్తి తల్లి పేరున ఇళ్ల స్థలం మంజూరు అయింది. ఐతే పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలం కేటాయిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వేరుగా ఉంది. వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్నారు. పేదల అవసరాలను అసరాగా చేసుకుని అక్రమాలకు తెర తీస్తున్నారు. ఇళ్ల స్థలం కేటాయించాలంటే లక్షా 65వేలు కట్టాలని లబ్ధిదారులైన మూర్తి రాజును డిమాండ్‌ చేశారు స్థానిక వైసీపీ నేతలు. గూడు లేక ఇబ్బంది పడుతున్న వాళ్లు.. చేసేది లేక అప్పు తెచ్చి మరీ వారికి డబ్బులు చెల్లించారు. మొదటగా లక్షా 5 వేలు నగదు రూపంలో.. మిగిలిన 60వేలు యూపీఐ యాప్‌ ద్వారా చెల్లించానన్నాడు రాజు. ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న తాను.. అద్దెఇంటిలో ఉంటున్నానని.. ఇంటి స్థలం కోసం అప్పు చేసి మరీ డబ్బు కట్టానని వాపోయాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశానని...వాళ్లు విచారణ చేస్తున్నారని తెలిపాడు.

రెక్కాడితే కాని డొక్కాని తమ వద్ద నుంచి ఇళ్ల స్థలాల కోసం నేతలు డబ్బులు వసూలు చేయడం దారుణమని లబ్ధిదారులు వాపోతున్నారు. పేదలకు ఉచితంగా అందజేయాల్సిన ఇంటి స్థలాలపై వైసీపీ నేతలు గద్ధల్లా వాలడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కె. సావరంలో సుమారు వంద మంది ఇంటి స్థల లబ్ధిదారులు ఉన్నారు.. వీరి కోసం ప్రభుత్వం సుమారు 2ఎకరాల 60సెంట్ల భూమి తీసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల పెనుగొండల మండలం సిద్ధాంతంలో ఇళ్ల స్థలాలకు వైసీపీ నేతలు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఓ లబ్ధిదారుడు ఫిర్యాదు చేయగా.. అతనిపై దాడికి పాల్పడ్డారు. ఇలాపై పేదలను జలగల్లా పట్టిపీడిస్తున్నారు వైసీపీ నేతలు.

Tags

Next Story