ఏపీలో దయనీయంగా మారిన భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అనాలోచిత నిర్ణయం కారణంగా పదుల సంఖ్యలో కార్మికులు పనులు లేక సూసైడ్ చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకివచ్చి ఏడాది అవుతున్నా రాష్ట్రంలో ఇసుక సమస్య తీరడంలేదు. టీడీపీ హాయంలోతీసుకొచ్చిన ఇసుక విధానంలో లోపాలు ఉన్నాయని, కొత్తపాలసీని తీసుకొచ్చింది. కొత్త పాలసీ మాటేమో కానీ ఏపీలో ఇసుక బంగారం కంటే మిన్నగా మారింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటే భయపడుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో ట్రాక్టర్ ఇసుక 1600 రూపాయల ధర ఉంటే ఇప్పడు ఆదే ట్రాక్టర్ ను 5 వేల నుంచి 6 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్ లో అధికారపార్టీ నాయకులే సిండ్‌కేట్‌గా మారి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. కొత్త ఇసుక పాలసీ పేరుతో ముఖ్యమంత్రి తమ పొట్టలు కొట్టారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక కొరతపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక్క రోజు దీక్ష చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైజాగ్ లో లాంగ్ మార్చ్ నిర్వహించారు. బీజేపీ కూడా విజయవాడలో ఇసుక సత్యగ్రహా దీక్ష చేపట్టింది. వామపక్ష పార్టీలు ఇసుకను నిలిపివేసిన దగ్గర నుంచి అనేక ఆందోళనలు నిర్వహించాయి. ఇప్పుడు ఇసుక కోరతపై సాక్ష్యాతూ వైసీపీ ప్రజా ప్రతినిధులే ప్రభుత్వంపై విమర్శలు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.
కరోనా దెబ్బకు అన్ని రంగాలతో పాటు అసంఘటిత రంగం కూడా పూర్తిగా స్థంభించిపోయింది. లాక్ డౌన్ తో కొంత సడలింపులు ఇచ్చి పనులు చేసుకొనే వీలున్నా.. ఇసుక కొరతతో భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికల జీవితాలు లేక ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కరోనా సమయంలో కార్మికులను ఆదుకుంటామని ప్రభుత్వం చేప్పింది. అయితే కార్మిక సంక్షేమ బోర్డులో నమోదైన వారికి మాత్రమే పరిహారం ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు సంక్షేమ బోర్డులో ఉన్న వారికి మాత్రమే పరిహారం అంటే సగం మంది కార్మికులు నష్టపోతారు. కృష్ణాజిల్లాలో దాదాపు 1.25 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారు. విజయవాడ నగరంలోనే అత్యధికంగా 70 వేల మంది వరకు ఉన్నారు. ఇసుక లేకపోవడంతో వీరంతా రోడ్డున పడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరాతి రాజధానిపై చేసిన గందరగోళం కారణంగా నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో బిల్డర్స్ కు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొన్ని సగం నిర్మాణాలు పూర్తయ్యాయి, మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. పూర్తయిన వాటిని కొనే నాధుడులేడు. ప్రారంభమైన వాటిని పూర్తి చేయాలో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇసుక కోరతతో ఎక్కువ ధర చెల్లించి ఇసుకను కొనుగోలు చేసి నిర్మించాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బిల్డర్స్ అంటున్నారు.
ఇసుక కోసం ఏపీలోని రాజకీయ పార్టీల మద్య మాటల యుద్దం నడుస్తోంది. ప్రభుత్వ చేతకానితనం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పాడటమే కాదు.. భవన నిర్మాణరంగం కుంటుపడిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు తీసుకు వచ్చి రాష్ట్రంలో కొరతను నివారించాలని ప్రతిపక్షాలు, ప్రజలు కొరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com