పంచభూతాలను కాపాడుకుందాం : పవన్ కళ్యాణ్

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా పర్యావరణ ప్రేమికులందరికీ శుభాభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో పలు కీలక అంశాలు గుర్తుచేశారు.. మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలం. మానవ మనుగడకు ఆధారం పంచభూతాలు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షీించుకున్నప్పుడే మానవజాతి కోభిల్లుతుందని చెప్పారు. అలాగే మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి ఉందన్న పవన్ కళ్యాణ్. చక్కటి పర్యావరణం వున్నచోట ఆస్పత్రుల అవసరమే ఉండదని నిపుణులు చెప్పిన విషయాన్నీ ప్రస్తావించారు. ఇక జనసేన మూల సిద్ధాంతాలలో పర్యావరణానికి సముచిత స్థానం కల్పించామని అన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన కాంక్షిస్తోందని.. అందులో భాగంగానే *మన నది- మన నుడి” కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే “మన నది- మన నుడి" కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుకు తీసుకెళతామని చెప్పారు. పర్యావరణానికి హితమైన మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను అమలుచేస్తామని అన్నారు.. పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై నిరసన గళం వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అలాగే ఆరోగ్య ప్రదాయని అయిన పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలని కోరారు.. పర్యావరణం మనకు కంటికి కనిపించని విలువైన సంపద అని అభిప్రాయపడిన పవన్ కళ్యాణ్.. అడవులు, కొండలు, నదులను మనమే కాపాడుకోవాలని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com