శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయం

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. 8 నుంచి రెండు రోజులు ప్రయోగాత్మకంగా దర్శనాలు మొదలవుతాయి. 11 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు, కంటైన్మెంట్ జోన్లలోని వారిని అనుమతించబోమని స్పష్టంచేశారు.
శ్రీవారి సర్వదర్శనం ఉదయం 7న్నర గంటల నుంచి మొదలవుతుంది. అంతకుముందు గంట సేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. రాత్రి 7న్నర వరకు శ్రీవారి దర్శనాలకు సామాన్యులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో మాత్రమే కాలినడక భక్తులకు పర్మిషన్ ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు అనుమతిస్తారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. అలిపిరి నుంచే తనిఖీలు, శానిటైజేషన్ చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. దర్శనాల తర్వాత తీర్థం, శఠగోపం ఉండవు. శ్రీవారి పుష్కరిణిలోకి ఎవరినీ అనుమతించరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com