చనిపోయిన మేక మాంసం తిని ఒకరు మృతి!

చనిపోయిన మేక మాంసం తిని ఒకరు మృతి!
X

కలుషిత ఆహారం తిన్న గిరిజనుల్లో ఒకరు మృతి చెందడం, మరికొందరు అస్వస్థతకు గురవడం.. వీరిని పరామర్శించేందుకు వచ్చిన MPDOపై దాడి జరగడం విశాఖ ఏజెన్సీలో కలకలం రేపింది. మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నా.. కొందరు వామపక్ష నేతలు స్థానికుల్ని రెచ్చగొట్టి తమపై దాడికి పురిగొల్పారని అధికారులు అంటున్నారు. విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం గన్నేరుపుట్టు పంచాయతీలోని డొంకినవలసలో రెండ్రోజుల క్రితం కొందరు గ్రామస్థులు చనిపోయిన మేక మాంసం తిన్నారు. ఫుడ్‌పాయిజన్ అవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 27 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి తోడు కలుషిత నీటి కారణంగా డయేరియా ప్రబలిందని అధికారులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు గ్రామంలో క్యాంప్ పెట్టారు. 9 మందిని మెరుగైన వైద్యం కోసం పాడేరు తరలించారు.

డొంకినవలసలో పరిస్థితి పర్యవేక్షించేందుకు MPDO ఇమాన్యుయేల్‌ అక్కడికి వెళ్లారు. ఐతే.. కొందరు వామపక్ష నాయకులు కలుషిత నీటి సమస్య పరిష్కారంపై అధికారుల్ని నిలదీయాలంటూ స్థానికుల్ని రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. నీటి విషయంపై MPDOతో వాగ్వాదానికి దిగిన గిరిజనులు.. ఆయనపై చేయి చెసుకున్నారు. అడ్డుకోబోయిన మిగతా ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దాడి చేశారు. గాయాలపాలైన MPDO ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఉద్యోగులపై దాడి విషయం తెలుసుకున్న అరకు MLA శెట్టి ఫాల్గుణ ఆస్పత్రికి వెళ్లి MPDOను పరామర్శించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. వర్షాల సమయం కావడంతోనే నీరు కలుషితం అయి ఉంటుందని.. సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అటు, ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ చెప్తున్నారు.

Tags

Next Story