తెలుగు రాష్ట్రాల నీటి వివాదానికి తాత్కాలికంగా బ్రేక్

తెలుగు రాష్ట్రాల నీటి వివాదానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల ఉన్నతాధికారులు సమావేశమై పలు నిర్ణయాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. మొదట ఇరు రాష్ట్రాలు తమ వాదనలను బోర్డు దృష్టికి తీసుకొచ్చాయి. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ అంశంతో పాటు, టెలిమెట్రీల ఏర్పాటు, ఈ ఏడాదిలో నీటి పంపిణీ, మళ్లింపు జలాల వాటా తదితర అంశాలపై చర్చించారు.
కృష్ణా నదిపై నిర్మించే అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖలు తమకు సమర్పించాలని కృష్ణా బోర్డు ఛైర్మన్ పరమేశం కోరారు. అలాగే గత ఏడాది తీసుకున్నట్లు గానే ఈ నీటి సంవత్సరంలో కూడా ఏపీ, తెలంగాణ వరుసగా 66:34 నిష్పత్తిలో నీటిని తీసుకొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని ఆయన చెప్పారు. శ్రీశైలంలో విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు చెరి సగం వాడుకునేలా ఒప్పందం కుదిరిందని అన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా డీపీఆర్‌లపైనే చర్చ జరిగింది. ఏపీలోని గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించిన జలాలపై జలశక్తి శాఖకు ఇప్పటికే నివేదించినట్లు బోర్డు వెల్లడించింది. మరోవైపు ప్రస్తుత నీటి సంవత్సరానికిగానూ రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల విషయంపైనా బోర్డు స్పష్టత ఇచ్చింది. యథావిధిగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 66 : 34 నిష్పత్తిలో నీటిని వినియోగించుకునేలా కేటాయింపులు చేసింది. అలాగే కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విజయవాడ తరలించాలని మరోసారి ఏపీ అధికారులు బోర్డును కోరారు. అయితే దీనిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖదే తుది నిర్ణయమని బోర్డు క్లారిటీ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com