రంగుల రాజకీయం.. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయి?

రంగుల రాజకీయం.. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయి?
X

వైసీపీ ప్రభుత్వ రంగుల రాజకీయంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి..రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రతి దాంట్లో ఆదా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఈ 1500 కోట్ల వృధాపై ఏం చెప్తుందని ప్రశ్నిస్తున్నాయి. CM జగన్‌ ఒత్తిడితోనే రంగుల రాజకీయం జరిగింది కాబట్టి ఈ మొత్తాన్ని YCP నుంచే వసూలు చేయాలనేది TDP అధినేత చంద్రబాబు డిమాండ్. ప్రజాధనం వృధాకి పాలకుల మూర్ఖత్వమే కారణం కాబట్టి ఆ పార్టీ నుంచే డబ్బులు రాబట్టాలని అంటున్నారు. BJP కూడా ఈ విషయంపై తీవ్రంగానే స్పందించింది. రంగులు వేయడానికి, తీయడానికి అవుతున్న వేల కోట్లతో రాయలసీమలో కరువు లేకుండా చెయ్యొచ్చంటున్నారు. తాజా సుప్రీం తీర్పుతోనైనా YCP ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు.

పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగుల విషయంలో పొలిటికల్ వాదనలు ఎలా ఉన్నా.. పంచాయతీరాజ్ చట్టంలో ఈ రికవరీకి సంబంధించి కొన్ని స్పష్టమైన నిబంధనలున్నాయి. ఎక్కడైనా చట్ట విరుద్ధమైన ఖర్చులకు సంబధించిన లెక్కలు బయటపడినప్పుడు అందుకు బాధ్యులు ఎవరు అవుతారో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం పంచాయతీ సెక్రటరీతో మొదలుపెట్టి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వరకూ బాధ్యులుగా చూపించవచ్చు. సంబంధిత మొత్తాన్ని ఖర్చు పెట్టినవాళ్లే కాదు, దాన్ని ఆధరైజ్ చేసిన వారు కూడా 'స్టేట్ ఆడిట్ యాక్ట్-1989' సెక్షన్‌-11 ప్రకారం చర్యలకు బాధ్యులు అవుతారు. ప్రస్తుతం YCP రంగుల విషయంలో ఈ జీవో జారీ చేసిన ఉన్నతాధికారులు, వారికి పైస్థాయి నుంచి ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు కూడా జవాబుదారీగా ఉండాలనే వాదన కూడా ఉంది.

ఎక్కడైనా, ఎవరైనా ప్రభుత్వ ధనాన్ని వృధాగా ఖర్చుపెట్టినా, అవసరం లేని చోట అధికంగా ఖర్చు చేసినా ఆడిట్‌లో ఆ లోపాలు బయటపడితే వారిపై చర్యలు తీసుకునే వీలు ఉంది. పంచాయతీరాజ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కి సంబంధించిన 'స్టేట్ ఆడిట్ యాక్ట్-1989' ప్రకారం చట్ట విరుద్ధమైన ఖర్చుల్ని అందుకు బాధ్యులైన వారి నుంచి రాబట్టడానికి సర్‌ఛార్జ్‌ సర్టిఫికెట్‌ జారీ చెయ్యొచ్చు. ఈ సర్‌ఛార్జ్‌ సర్టిఫికేట్‌ కోర్టు డిక్రీతో సమానం. డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్-DSA కనుక నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారాల్లో తేడాలు గుర్తిస్తే వాటిపై వివరణ కోరతారు. పంచాయతీకి నష్టం కలిగించినా, నియమాలకు వ్యతిరేకంగా అధిక వ్యయం, లాభదాయకంగా ఖర్చులు చేసినట్లు ఆడిట్‌ అధికారి గుర్తిస్తే ఆ వెంటనే సర్‌ఛార్జ్‌ సర్టిఫికేట్‌ డ్రా చేస్తారు. దీనిపై అప్పీల్‌కు వెళ్లినా అక్కడ కూడా వృధా జరిగినట్టు నిర్థారణ అయితే సదరు వ్యక్తి దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ తరహా ఘటనల్లో గతంలో పలువురు సర్పంచ్‌లు పదవులు కోల్పోయారు. మరోసారి పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులయ్యారు. సర్పంచ్‌లే కాదు అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తరహాలోనే ఇప్పుడున్న చట్టం ప్రకారమే రంగుల విషయంలోనూ 1,500 కోట్ల రూపాయల వృధాపై బాధ్యులకు నోటీసులు ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. నిర్లక్ష్యానికి కారకులపైనే కాదు, దాన్ని ఆధరైజ్ చేసినవారిపైనా చర్యలకు ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు.

కేవలం పంచాయతీ స్థాయిలోనే కాదు.. మండలం, జిల్లా స్థాయిలో అయినా సరే బాధ్యులపై చర్యలు తీసుకునే వీలుంటుంది. మిస్ కాండక్ట్ వల్ల, నిబంధనలకు వ్యతిరేకంగా ఖర్చుపెట్టినా సరే సర్‌ఛార్జ్‌ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేయవచ్చు. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, మున్సిపాలిటీలు, జిల్లా గ్రంధాలయ సంస్థల్లాంటి వాటిల్లో వార్షిక ఆడిట్‌ను బట్టి రికవరీ విషయంలో చర్యలు తీసుకునే వీలుంటుంది. నిధుల వృధా విషయంలో ఇప్పటికే చాలా సందర్భాల్లో సర్‌ఛార్జ్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నా.. చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. నిఘా సరిగా లేకపోవడం వల్ల మనకు పటిష్టమైన చట్టాలున్నా అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఈ యాక్ట్‌ను సమర్థంగా అమలు చేస్తే వందల కోట్ల ప్రజాధనం వృధా అరికట్టే అవకాశం ఉంటుందని రెవెన్యూ ఎక్స్‌పర్ట్‌లు చెప్తున్నారు. కాగ్ తన రిపోర్ట్‌లో వివిధ అంశాల్ని ప్రస్తావించినట్టే.. లోకల్ ఫండ్ ఆడిట్‌పై DSA నివేదిక కూడా పక్కాగా ఉంటుందని అంటున్నారు. ఏపీలో పంచాయతీలకు పార్టీ రంగులు వేయడం, వాటిని తొలగించడానికి ఇప్పుడు వందల కోట్లు ఖర్చవుతున్న నేపథ్యంలో.. భవిష్యత్‌లో ఇలాంటి వృధాలకు ఛాన్స్ ఇవ్వకుండా రికవరీ యాక్ట్ పక్కాగా అమలు చేయాలంటున్నారు.

Tags

Next Story