నల్లజాతీయుల ఆందోళనలపై అమెరికా ప్రభుత్వం ఎదురు దాడి

నల్లజాతీయుల ఆందోళనలపై అమెరికా ప్రభుత్వం ఎదురు దాడి

నల్లజాతీయుల ఆందోళనలపై అమెరికా ప్రభుత్వం ఎదురుదాడి ముమ్మరం చేసింది. అల్లర్లు, హింసాత్మక ఘటనల వెనక భారీ కుట్ర ఉందని ట్రంప్ సర్కారు ఆరోపించింది. అతివాద సంస్థలే దేశంలో అశాంతి రాజేస్తున్నాయని విమర్శించింది. నిరసనల మాటన హింసను ప్రేరేపించాయని అమెరికా అటార్నీ జనరల్ విలియం బార్ చెప్పారు. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనల్లోకి అతివాద సంస్థలు ప్రవేశించి హింసాత్మకంగా మార్చేశారని ఆరోపించారు. యాంటిఫా వంటి అతివాద గ్రూపులు, రాజకీయ అనుబంధం కలిగిన నటులు హింసాత్మక ఘటనల్లో పాల్గొంటూ ఇతరులను ప్రేరేపించారని విమర్శించారు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. అమెరికా అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ కూడా ఇవే వ్యాఖ్యలు చేసింది. ఇది కచ్చితంగా అవకాశవాదుల పనే అని నిఘా రి పోర్ట్‌లో వెల్లడించింది. ఉద్యమకారులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించారని నివేదికలో పేర్కొంది. యాంటిఫా సహా అతివాద సంస్థలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఇక, జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనలను అదుపు చేసే క్రమంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. న్యూయార్క్ బఫేలో పోలీసులు ఓ వ్యక్తిని తోసేసిన వీడియో వైరల్‌గా మారింది. నిరసన తెలుపుతున్న ఓ వ్యక్తి, పోలీసులకు అడ్డుగా వచ్చి ఏదో చెప్పబోయాడు. దాంతో ఓ పోలీసు అతన్ని లాఠీతో నెట్టేశాడు. మరో పోలీసు కూడా చేత్తో బలంగా తోయడంతో అతను కిందపడిపోయాడు. దాంతోతలకు బలమైన గాయమైంది. ఐనప్పటికీ పోలీసులు కనికరించలేదు. అతనిపై దాడికి ప్రయత్నించారు. అంతలోనే మిగతా పోలీసులు వారిని వారించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. స్థానిక రేడియో స్టేషన్ WFO ఆ ఘటనను వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో ప్రజల్లో మళ్లీ ఆగ్రహంతో ఊగిపోయారు. సమీపంలో ఉన్న మెడికల్‌ సిబ్బంది స్పందించి అతన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రజాగ్రహం నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. అమానుషంగా ప్రవర్తించిన పోలీసులను సస్పెండ్ చేశారు.

నల్లజాతీయుల ఉద్యమంలో 8.46 అన్న అంకె నినాదంగా మారుతోంది. పోలీస్ అధికారి, జార్జ్‌ ఫ్లాయిడ్‌ను నేలకు అదిమిపెట్టి ఉంచిన సమయం 8 నిమిషాల 46 సెకన్లు అని విచారణలో బయటపడింది.

దాంతో, ఉద్యమకారులు ఆ అంకెను నినాదంగా మార్చారు. ఈ సమయాన్ని ఇంత కచ్చితంగా ఎలా నిర్ధారించారన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ ఆందోళనకారుల్లో మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. బోస్టన్, టాకోమా, వాషింగ్టన్‌లలో జరిగిన ప్రధర్శనలు 8.46 నిమిషాలపాటు జరిగాయి. హ్యూస్టన్‌లో చర్చిల్లో ప్రార్థనల సమయంలోనూ 8 నిమిషాల 46 సెకన్ల పాటు కొవ్వొత్తులను పట్టుకొని మోకాళ్లపై పాకుతూ నిరసన తెలిపారు. గూగుల్ సంస్థ కూడా 8.46 నిమిషాలపాటు మౌనం పాటించాలని ఉద్యోగులకు సూచించింది. జాతివివక్షకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి గూగుల్ కంపెనీ 210 కోట్లు విరాళంగా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story