చైనా ఇచ్చిన పెద్ద బహుమతి అదే.. : ట్రంప్

చైనా ఇచ్చిన పెద్ద బహుమతి అదే.. : ట్రంప్

చైనా వైరస్.. చైనా వైరస్‌ అంటూ ఆ దేశంపై కారాలు.. మిరియాలు నూరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్త మెత్తపడ్డారు. కరోనాను చైనా ఇచ్చిన చెడ్డ బహుమతిగా అభివర్ణిస్తూనే.. ఆ దేశంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారి వల్ల అమెరికా తీవ్రంగా ప్రభావితమైందని ట్రంప్.. చైనా ఇచ్చిన పెద్ద బహుమతి.. చెడ్డది కూడా అయిన కరోనాను.. ప్రారంభంలోనే ఆపి ఉండాల్సిందన్నారు. వైరస్ కారణంగా వుహాన్ చాలా ఇబ్బందులు పడిందని.. ఐతే చైనాలో ఇతర ప్రాంతాలకు మాత్రం వైరస్ వ్యాపించలేదన్నారు.

అమెరికా నుంచి చైనా ఎన్నో లాభాలు పొందిందన్న ట్రంప్.. చైనాను తిరిగి అభివృద్ధి చేసుకునేందుకు 500 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు. చైనాతో కూడా కలిసి పనిచేస్తామన్న ట్రంప్.. ఇప్పుడు జరిగింది ఇంకెప్పుడూ జరగకూడదు అని అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో అమెరికా సరైన నిర్ణయాలు తీసుకుందని.. గొప్పగా పని చేసిందని ట్రంప్ తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే అమెరికాకు అత్యంత గొప్ప ఆర్థిక వ్యవస్థ ఉందని... అదే కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తోడ్పడిందని అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ ను అన్ని రాష్ట్రాలు ముగిస్తే ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు.

అటు.. వ్యాక్సిన్ అభివృద్ధిలో ఆశాజనకమైన ఫలితాలు వచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించామని... తయారీలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. భద్రతాపరమైన పరీక్షలు పూర్తయి, పరిస్థితులు అనుకూలిస్తే దాదాపు 2 మిలియన్ వ్యాక్సిన్ లను సరఫరా చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story