దివ్య హత్యకేసును చేదిస్తున్న పోలీసులు..

దివ్య హత్యకేసును చేదిస్తున్న పోలీసులు..
X

విశాఖలో హత్యకు గురైన దివ్య కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించడంలో వసంత గ్యాంగ్‌తోపాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దివ్య బాబాయి తీరుపైనా అనుమానంతో ఆయనను ప్రశ్నిస్తున్నారు. దివ్య స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం. చిన్న వయసులోనే పెళ్లైనా కొన్ని కారణాలతో భర్తకు దూరమైంది. 2015లో దివ్య తల్లి, సోదరుడు, అమ్మమ్మ హత్యకు గురయ్యారు. తర్వాత నుంచి బాబాయి, పిన్ని వద్దే ఉంది. ఐతే.. బాబాయి దివ్యను పథకం ప్రకారం విశాఖ తీసుకెళ్లినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. తనకు పరిచయం ఉన్న గీత అనే మహిళ వద్ద దివ్యను ఉంచి ఆమె ద్వారా డబ్బు సంపాదించాలని చూశాడు. అక్కడి నుంచి తప్పించుకుని 8 నెలల క్రితం వసంత వద్దకు చేరింది దివ్య. ఐతే.. ఇటీవల వసంత గ్యాంగ్‌తో డబ్బు పంపకాల విషయంలో గొడవలు జరిగాయి. ప్రస్తుతం వసంతను, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. తాము చేసిన హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు దివ్యకు ఫినాయిల్ పట్టించి, నిద్ర మాత్రలు వేసినట్టు వసంత ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. వసంతతో పాటు ఆమె సోదరి మంజుల, సంజయ్‌, విద్యను వీరికి పరిచయం చేసిన మిగతా వాళ్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

అక్కయ్యపాలెం చెక్కుడురాయి భవనం సమీపంలో 3 రోజుల క్రితం దివ్య హత్యకు గురైంది. అత్యంత దారుణంగా వాతలు పెట్టి, గుండు గీసి, కనుబొమ్మలను కత్తిరించి దివ్యను చంపేశారు. నాలుగు రోజులపాటు చిత్రహింసలు పెట్టి ఆమెను చంపినట్టు పోలీసులు చెప్తున్నారు. ఒంటిపై 33 చోట్ల గాయాలైనట్టు గుర్తించారు. అట్లకాడతో ఈ వాతలు పెట్టినట్టు భావిస్తున్నారు. అత్యంత దారుణంగా దివ్యను హింసించి చంపేశాక.. మృతదేహాన్ని దహనం చేసేందుకు నిందితులు వేసిన ప్లాన్ ఆఖరు నిమిషంలో బయటపడింది. అంతిమయాత్ర వాహనంలో డెడ్‌బాడీ తరలించే ప్రయత్నం చేసినప్పుడు.. ఆ వాహనం నడిపే వ్యక్తి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది ఆత్మహత్య కాదు హత్య అని తెలిసింది. దీనిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. నిన్న KGHలో దివ్య బంధువుల సమక్షంలో పోస్ట్‌మార్టం పూర్తైంది. తర్వాత మృతదేహాన్ని వారికి అప్పగించారు. మరికొంత దర్యాప్తు తర్వాత మర్డర్ కేసులో దోషులు ఎవరనేది పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags

Next Story