అధికారులంతా ఏకమై దోచుకోవాలనుకున్నారు.. అడ్డంగా దొరికిపోయారు

అధికారులంతా ఏకమై దోచుకోవాలనుకున్నారు.. అడ్డంగా దొరికిపోయారు

హైదరాబాద్‌లో ఏకకాలంలో జరిగిన ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. కంచే చేను మేసినట్లు.. అధికారులంతా ఒక్కటై లంచాలు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. షేక్‌పేట ఎమ్మార్వో సుజాత, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జున, బంజారాహిల్స్‌ ఎస్‌ఐ రవీందర్ నాయక్ పై కేసులు నమోదు చేశారు. ఇలా అధికారులంతా మూకుమ్మడిగా లంచాలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోవడం సంచలనంగా మారింది.

బంజారాహిల్స్‌లో ఒకటిన్నర ఎకరం స్థలంపై వివాదం నడుస్తోంది. సయ్యద్‌ అబ్దుల్‌కు చెందిన భూమిని రెవెన్యూ స్థలంగా ప్రభుత్వం పేర్కొంది. స్థలం తమదేనంటూ సయ్యద్‌ అబ్దుల్‌ కోర్టుకెక్కాడు. స్థలం సయ్యద్‌ అబ్దుల్‌దేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసేసి సయ్యద్‌ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయితే రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సయ్యద్‌ అబ్దుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు RI నాగార్జున రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. ముందస్తుగా 15 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఆర్‌ఐ నాగార్జునను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇదే స్థల వివాదంలో ఆర్‌ఐ నాగార్జునతో పాటు బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌ కూడా డబ్బులు డిమాండ్ చేశాడు. 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసి లక్షా 50 వేలు తీసుకున్నాడు. కేసు నుండి తప్పించాలి అంటే మరో 3 లక్షలు కావాలని వేధించాడు. దీంతో ఎస్సై రవీందర్ నాయక్ పై కూడా కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అటు షేక్ పేట్ తహసీల్దార్ సుజాత ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది.. 30 లక్షల నగదు, అర కిలో బంగారం, పలు డాక్యుమెంట్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story