ఇళ్ల పట్టాల కోసం సాగుభూమి లాక్కున్నారని మహిళ ఆత్మహత్యాయత్నం

ఎన్నో ఏళ్లుగా తాము సాగుచేసుకుంటున్న భూమిని లాక్కున్నారంటూ మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం, ఆమె సాగుచేసుకుంటున్న 30 సెట్ల భూమిని ఇటీవలే రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురై తన స్థలంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
శాంతి కుమారి అనే మహిళ భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి తండ్రి వద్దే ఉంటోంది. బండి పుంతలోని 30 సెంట్ల భూమిని ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవడంతో ఆందోళనకు గురైంది. తాను కూడా వైసీపీ కార్యకర్తనేనని, స్థానిక నాయకులు తనకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపిస్తోంది. తనకు జీవనాధారంగా ఉన్న భూమి తీసేసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నిస్తోంది. స్థానిక వైసీపీ నాయకుల తీరు వల్లే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని అంటోంది. తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శాంతకుమారిని మాల మహాసేన ప్రతినిధులు పరామర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com