విద్యాశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష.. పది పరీక్షలపై నేడే నిర్ణయం!

పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయా? లేక రద్దవుతాయా?... ఇదే విషయంపై ఇవాళ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారు. టెన్త్ పరీక్షల నిర్వాహణపై ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో.. సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మళ్లీ పరీక్షలు నిర్వహించాలా... లేదా అంతర్గత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలా అనేదానిపై ఇవాళ్టీ సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో మరోసారి పరీక్షలు నిర్వహించాలంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.. దీంతో పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. పరీక్షలను రద్దు చేసి అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అదే సమయంలో పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో కొత్త కరోనా కేసులు నమోదైతే.. ఎగ్జామ్ సెంటర్లను మార్చాలని కూడా ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం హైకోర్టు తీర్పుపై రాష్ట్ర విద్యాశాఖ సుదీర్ఘంగా చర్చించింది. జీహెచ్‌ఎంసీ మినహా పరీక్షలు నిర్వహిస్తే సాంకేతికంగా అనేక ఇబ్బందులతో పాటు విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నందున.. పరీక్షలను వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై ఇవాళ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.
పది పరీక్షలపై రివ్యూ అనంతరం కరోనా నివారణా చర్యలు, లాక్‌డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. వైద్య ఆరోగ్యగశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీనియర్ అధికారులతో చర్చించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

