ఏపీలో పెరుగుతూనే ఉన్న కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో పెరుగుతూనే ఉన్న కరోనా పాజిటివ్ కేసులు
X

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు.. 17 వేల 659 పరీక్షలు నిర్వహించగా.. 130 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3 వేల 718కి చేరింది. కరోనా నుంచి 30 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2 వేల 353 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోగా.. మృతుల సంఖ్య 75కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1290 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 810 మంది కరోనా బారిన పడగా.. వారిలో 508 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం 28 మంది డిశ్చార్జి అయ్యారు. శనివారం ఉదయం విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం ఏపీలో రికార్డుస్థాయిలో 210 కేసులు నమోదు కాగా.. ఆదివారం నాటికి 130 కేసులకు పరిమిత కావడం కాస్త ఊరటనిస్తోంది. లాక్‌డౌన్ సడలింపులు భారీగా ఇవ్వడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు చెబుతున్నారు.

ఢిల్లీ ఆంధ్రాభవన్‌కు కరోనా పాకింది. అందులో సీనియర్‌ అధికారికి కరోనా సోకింది. దీంతో ఉమ్మడి భవన్‌ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ రెసిడెంట్‌ కమిషనర్‌ ఆఫీసులను రెండింటిని సీజ్‌ చేశారు. రెండు రోజుల తరువాతే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని అంటున్నారు. కరోనా సోకిన అధికారిని ఇతర అధికారులు కూడా కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని ఢిల్లీ కాంట్‌ ఆర్మీ ఆస్పత్రి ఐసోలేషన్‌కు తరలించారు.

రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పాయింట్‌‌లను ఎత్తివేతపై వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి సరిహద్దు చెక్‌పోస్టులను ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవాలు అని కొట్టిపారేసింది. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్‌పాయింట్లలన్నీ లాక్‌డౌన్‌ ముగిసేవరకూ కొనసాగుతాయంటున్నారు అధికారులు. ఏపీకి వచ్చేవారంతా కచ్చితంగా స్పందన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకు తగ్గట్టుగా ప్రయాణాలు నిర్వహించుకోవాలని సూచించారు.

కొన్ని ప్రాంతాల్లో క్వారంటైన్‌ సెంటర్లు గొడవకు కారణమవుతున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్వారంటైన్‌ సెంటర్‌ను తొలగించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది.

పరస్పర దాడులు జరిగాయి. పరిస్థితి అదుపు తప్పడంతో గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులపై రాళ్లతో దాడిచేశారు. క్వారంటైన్‌లో ఉన్న కరోనా పేషెంట్లపైనా రాళ్లతో దాడిచేశారు. దీంతో పోలీసు సిబ్బందికి, క్వారంటైన్‌లో ఉన్న ఇద్దరు పేషెంట్లకు గాయాలయ్యాయి.

Tags

Next Story