తెలంగాణలో ఆగని కరోనా ఉధృతి.. తాజాగా..

తెలంగాణలో ఆగని కరోనా ఉధృతి.. తాజాగా..

తెలంగాణపై కరోనా ఉధృతి ఆగడం లేదు. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గత 24 గంటల్లో తెలంగాణలో 154 పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. వీటిలో ఒక్క GHMC పరిధిలోనే 132 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 12 , మేడ్చల్‌ 3, యాదాద్రి 2, సిద్ధిపేట, మహబూబాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు, కరీంనగర్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3 వేల 650కి చేరింది. ఇప్పటివరకు 1742 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా... ప్రస్తుతం 1771 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రలంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులే భయపెడితే.. ఇప్పుడు పెరుగుతున్న మరణాల సంఖ్య జనాలను బెంబేలెత్తిస్తోంది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 14 మంది కరోనాకు బలయ్యారు. రోజు ఒక్కరో ఇద్దరు మాత్రమే కోవిడ్‌తో మృతి చెందగా.. అది ఏకంగా 14 చేరడం కలవరం రేపుతోంది. కరోనా మనిషిపై ఏస్థాయిలో దాడి చేస్తుందో తాజాగా నమోదైన మృతుల సంఖ్యను బట్టి తెలుస్తోంది.

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు ఉన్న వారికి ఇకపై ఇళ్లలోనే చికిత్స అందించాలని నిర్ణయించింది. అలాగే బాధితులకు జిల్లా స్థాయి కేంద్రాల్లోనే చికిత్స అందించాలని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రా‍ల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటల.. జీవనోపాధి కోల్పోకూడదని మాత్రమే లాక్‌డౌన్‌ని ఎత్తి వేశామని.. ప్రజలు అవసరం లేకున్నా బయటికి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

కోవిడ్‌ బాధితుల సంఖ్య పెరిగితే ప్రభుత్వం, వైద్యుల మీది ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు ఈటల. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తక్కువ లక్షణాలు ఉన్న పాజిటివ్ పేషంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రజలు సహకరించాలన్నారు. దేశంలో కరోనా కేసులు పది లక్షల వరకు చేరొచ్చని.. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి ఈటల.

ఇవాళ్టి నుంచి మరిన్ని సడలింపులు ఉండడంతో.. కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుందా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం కరోనా కేసులు నమోదైన కంటైన్‌మెంట్‌జోన్లలో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story