8 Jun 2020 12:38 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / మన బడులు మళ్లీ...

మన బడులు మళ్లీ తెరుచుకోవాలంటే విదేశీ పద్దతులు అనుసరిస్తే మేలేమో: తల్లిదండ్రులు

మన బడులు మళ్లీ తెరుచుకోవాలంటే విదేశీ పద్దతులు అనుసరిస్తే మేలేమో: తల్లిదండ్రులు
X

పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలంటే భయం.. పాఠశాలలు ప్రారంభించాలంటే భయం. కరోనా మహమ్మారి చిన్నారుల జీవితాలను ఛిద్రం చేస్తుందేమోనని అటు ప్రభుత్వాలతో పాటు, ఇటు తల్లిదండ్రులూ ఆందోళన చెందుతున్నారు. రెండు నెలల లాక్డౌన్ లో కేసులను కట్టడి చేయగలిగినా అనంతరం తెరుచుకున్న అనేక సంస్థలు, రోడ్ల మీద జనం సందోహం కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరం రానే వచ్చింది. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో విద్యా సంస్థలు తెరవాలంటే ఎలాంటి ప్రణాళికలు అవలంభించాలి.. విద్యార్థులను సురక్షితంగా ఉంచడం సాధ్యమేనా అనే సందేహాలు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలను వేధిస్తున్నాయి. అయితే ఇతర దేశాల్లో వైరస్ ని ఎదుర్కోవడానికి వినూత్న ప్రణాళికలు చేపట్టి పిల్లలు బడిలో సురక్షితంగా ఉండే చర్యలు తీసుకుంటున్నాయి. అలాంటి చర్యలే మనదేశంలోనూ అవలంభిస్తే తల్లిదండ్రులు నిశ్చితంగా పిల్లలను బడికి పంపించే అవకాశం ఉంటుంది. మరి ఏఏ దేశాల్లో ఎలాంటి చర్యలు అవలంభిస్తున్నారో ఒకసారి చూద్దాం..

జపాన్.. తరగతి గదుల్లో గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా మార్పులు చేశారు. పిల్లలందరూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించడం, చేతులు తరచూ శానిటైజ్ చేసుకోవాలి. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతను చెక్ చేస్తూ ఒకవేళ ఏదైనా పాజిటివ్ కేసు బయట పడితే వెంటనే పాఠశాల మూసే ఏర్పాట్లు చేశారు.

వియత్నాం.. ఇక్కడ రోజు మార్చి రోజు స్కూలు పెడుతున్నారు. తరగతి గదిలో 20 మంది విద్యార్థులకంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. పేరెంట్స్ మీటింగ్, టీచర్స్ మీటింగ్ వంటి విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ రద్దు చేశారు.

హాంకాంగ్: కిండర్ గార్డెన్ విద్యార్థులకు స్కూల్ లేదు. మిగిలిన విద్యార్థులకు ఒంటి పూట బడులు. లంచ్ బాక్సులు తెచ్చుకుని అందరూ ఒక చోట గుమికూడి భోజనం చేయకూడదని ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం.

ఇటలీ.. సెప్టెంబరు నుంచి ఆన్ లైన్ తరగతుల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఇందుకు గాను కొత్తగా 24 వేల మంది ఉపాధ్యాయులను నియమించుకునే యోచనలో ఉంది అక్కడి విద్యాశాఖ.

దక్షిణ కొరియా.. బడులు ప్రారంభించాలా వద్ద అన్న మూడు నెలల మీమాంస అనంతరం ఏప్రిల్ 9 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించింది. ఉపాధ్యాయులు స్కూలుకు వస్తారు. విద్యార్థులు ఇంట్లో ఉండి వారు తరగతి గదిలో చెప్పే పాఠాలు ఆన్ లైన్ లో వింటారు.

ఫ్రాన్స్.. తరగతి గదిలో 15 మంది విద్యార్ధులే ఉండాలి. మాస్కులు తప్పని సరిగా ధరించాలి. హాజరు తప్పని సరికాదనే వెసులు బాటు కల్పించారు.

తైవాన్.. అసలు ఇక్కడ విద్యా సంస్థలు మూసివేయలేదు. వైరస్ వ్యాప్తి విషయం తెలియగానే ముందు జాగ్రత్త చర్యగా ప్రతి తరగతి గదిలో కొత్తగా శానిటరీ మానిటర్లను ఏర్పాటు చేశారు. విద్యార్ధుల చుట్టూ ప్లాస్టిక్ తెరలు అమర్చారు. కిటికీలు తెరిచి ఉంచారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడంతో పాటు బూట్లను క్రిమి సంహారకం చేసేలా ఏర్పాట్లు చేశారు.

బెల్జియం.. మార్చినెల మధ్యలో స్కూల్స్ మూసేసారు. మళ్లీ మే 18న తెరుచుకున్నాయి. అయితే తరగతి గదిలో 10 మంది విద్యార్ధుల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధన పెట్టింది. భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంది. మాస్కులు, శానిటైజేషన్, విద్యార్ధులు గుంపులుగా ఉండకుండా చూడడం వంటి చర్యలు చేపడుతూ విద్యాసంవత్సరాన్ని కొనసాగించాలనుకుంటోంది.

Next Story