గుంటూరులో పసుపు, మిర్చి రైతుల కష్టాలు వర్ణనాతీతం

గుంటూరులో పసుపు, మిర్చి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గత నెలలో పసుపు పంటను అమ్మితే ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించేందుకు ఇంకా రెండు నెలల సమయం పడుతుందని చెబుతున్నారని.. ఇదేమని ప్రశ్నిస్తే గెంటేస్తున్నారని వాపోయారు. పంటను తీసుకొస్తే సరుకు గ్రేడింగ్ పేరుతో వెనక్కి పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గతేడాది దుగ్గిరాల మార్కెట్‌లో పసుపు అమ్మితే మంచి రేటు వచ్చిందని.. ఇప్పుడు ఎందుకు న్యాయం చేయడం లేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కరోనా ఆంక్షల పేరుతో రేటు దిగజారేలా చేశారని మండిపడ్డారు. రైతులకు వెంటనే మద్దతు ధర చెల్లించి రైతులను సత్వరమే ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
అటు రైతులను దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పసుపు, మిర్చి రైతులతో కలిసి దీక్ష నిర్వహించారు. పసుపు, మిర్చి రైతులను కాపాడాలని.. మార్క్‌ఫెడ్ తక్షణమే పసుపు రైతులకు డబ్బులు చెల్లించాలని మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు డిమాండ్ చేశారు. రైతాంగ వ్యతిరేక విధానాలను సీఎం జగన్ విడనాడాలన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

