ఆన్ లైన్ పాఠాలు.. ఎన్నో కంప్లైంట్లు..

కరోనా వచ్చి పాఠశాల విద్యా విధానాన్ని మార్చేస్తుందేమో అని అనుకోవాల్సి వస్తోంది ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని విద్యాసంస్థల్ని చూసి. పాఠశాలలు తెరవాలంటే ప్రభుత్వాలూ భయపడుతున్నాయి.. పిల్లల్ని స్కూలుకు పంపించాలంటే తల్లిదండ్రులూ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నాయి పాఠశాలలు.. ఆన్ లైన్ పాఠాల పేరుతో పిల్లలకు అంతో ఇంతో బోధిస్తున్నాయి. ఖాళీగా కూర్చునే బదులు ఏదో ఒకటి నేర్చుకుంటారు అని తల్లిదండ్రులూ అనుకోవలసి వస్తోంది.
పెద్ద తరగతుల పిల్లలకే ఆన్ లైన్ క్లాసులు ఉండేవి ఒకప్పుడు.. ఇప్పుడు ఈ కరోనా పుణ్యమా అని ఎల్ కేజీ చదివే పిల్లాడు కూడా అన్ లైన్ లో అక్షరాలు నేర్చుకుంటున్నాడు. అయితే పాఠ్యాంశాల వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవాలంటే కొంత మొత్తం ఫీజులు కట్టాలని షరతులు పెడుతున్నాయి విద్యాసంస్థలు. అయితే ప్రభుత్వం నెలవారీ ఫీజులు వసూలు చేయమంటూ విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ మూడు టెర్మ్ లలో కట్టాలి అంటున్నాయి కొన్ని సంస్థలు. ఇక పాఠాలు వినాలంటే ట్యాబులు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఇద్దరు పిల్లలుంటే ఈ భారం తడిసి మోపెడవుతోంది.
ఇక పిల్లలు ఆన్ లైన్ చదువులంటే అంతగా ఆసక్తి చూపట్లేదు. సిగ్నల్ లేదని కొందరు, మొబైల్ డేటా సరిగా అందట్లేదని మరికొందరు కంప్లైంట్ ఇస్తున్నారు.
కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసు వినాలంటే కూడా స్కూల్ డ్రెస్ వేసుకుని కూర్చోవాలని షరతు విధిస్తున్నాయి. ఇలా అయితే స్కూలుకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది అని అంటున్నారు. పుస్తకాలను కూడా ఆన్ లైన్ ద్వారానే డెలివరీ చేస్తున్నాయి కొన్ని విద్యాసంస్థలు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పిల్లలకు ఆన్ లైన్ లో తరగతులు ఏవిధంగా నిర్వహిస్తాము, మీరు ఇంటి వద్ద వారిని ఏ విధంగా క్లాసుకు సిద్దం చేయాలి అనే అంశాల మీద తల్లిదండ్రులు దాదాపు రెండున్నర గంటల క్లాసును నిర్వహిస్తున్నాయి. మొత్తానికి ఏదో విధంగా ఎంతో కొంత నేర్చుకుంటే సంతోషమే. లేదంటే టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతున్నారని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

