ప్రాణాలు తీసిన చున్నీ.. బండి చక్రంలో చుట్టుకుని..

మహిళలు ధరించే చున్నీలు వారి ప్రాణాలు తీస్తున్నాయి. బండి మీద కూర్చునేటప్పుడు దగ్గరకు తీసుకున్నా ఆ తరువాత దాని మీద ధ్యాస ఉండదు. అదే వారి ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. తాజాగా కడప జిల్లా గోపవరం మండలం పెదపోలుగుంట గ్రామానికి చెందిన మునగల లక్ష్మీదేవి తన అజాగ్రత్త కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంది. మృతురాలి భర్త సుబ్రహ్మణ్యం పనుల కోసం చీమకుర్తికి పది రోజుల క్రితం భార్యా పిల్లలతో వెళ్లాడు. అక్కడ పన్లేమీ లేవు ఖాళీగా ఉండడం ఎందుకుని బండి మీద వారి స్వగ్రామానికి బయల్దేరాడు భార్యా పిల్లలను తీసుకుని.
భార్య లక్ష్మీదేవి చుడీదార్ వేసుకుని వెనుక కూర్చుంది ఒక పిల్లవాడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని. మార్గమధ్యంలో ప్రకాశం జిల్లా, పామూరు మండలం భూమి రెడ్డి పల్లి వద్ద లక్ష్మీదేవి ముఖానికి చుట్టుకున్న చున్నీ బండి వెనుకటైరులో ఇరుక్కుపోయింది. దాంతో వాహనంపై నుంచి జారిపడి తలకు తీవ్రగాయాలై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బాబుకు మాత్రం గాయాలేవీ కాకపోవడంతో సురక్షితంగా బయటపడ్డాడు. చిన్నారులకు ఏమీ అర్థం కాక రక్లపు మడుగులో పడి ఉన్న తల్లిని చూస్తూ అలాగే ఉండిపోయారు. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

