జాగ్రత్తగా ఉండాలి... అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : సీఎం కేసీఆర్

జాగ్రత్తగా ఉండాలి... అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : సీఎం కేసీఆర్

తెలంగాణాలో కరోనా వైరస్ కేసులకు తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామన్నారు. వైరస్‌ సోకినప్పటికీ లక్షణాలు లేని వారికి ఇంట్లో వైద్యం అందిస్తున్నట్లు సిఎం వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్‌ విస్తరణపై సిఎం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో సమీక్షించారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని... అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు రాష్ట్రంలో అన్నిసదుపాయాలున్నాయన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్. ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆసుపత్రులకు ఉందన్నారు. ఈ విషయంలో కొన్ని మీడియాసంస్థలు, వ్యక్తులు ప్రజలను గందరగోళ పరుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గాంధీ ఆస్పత్రిలో 2వేల 150 మందికి చికిత్స అందించే అవకాశముందన్నారు. అందులో ఆక్సిజన్‌ సౌకర్యమున్న వెయ్యి బెడ్లున్నాయి. ప్రస్తుతం అక్కడ 247 మంది కరోనా బాధితులు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. ఏ కారణంతో మరణించినా సరే, వారందరికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశం అమలుకు సాధ్యం కాదన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే వైద్య ఆరోగ్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. పీపీ ఈకిట్లకు, మాస్కులకు కొరతలేదన్నారు.

Tags

Next Story