దేశవ్యాప్తంగా కరోనా  కల్లోలం.. 2 లక్షల 67 వేలు దాటిన కేసులు

దేశవ్యాప్తంగా కరోనా  కల్లోలం.. 2 లక్షల 67 వేలు దాటిన కేసులు
X

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైరస్ విజృంభిస్తోంది. దేశం మొత్తమ్మీద కరోనా కేసులు 2 లక్షల 67 వేలు దాటాయి. దాదాపు 7 వేల 5 వందల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఐతే, రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతుండడం ఊరట కలిగిస్తోంది. దాదాపు 50 శాతం మంది కరోనా నుంచి బయటపడుతున్నారు. లక్ష 30 వేల మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుంటుంటే, లక్ష 29 వేల మంది హాస్పిటళ్లలో ట్రీట్‌మెంట్ తర్వాత కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.

మహారాష్ట్రలో కరోనా పెను విలయమే సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపు 90 వేలకు చేరుకున్నాయి. కరోనా బాధితుల సంఖ్యలో మహారాష్ట్ర, చైనాను దాటేసింది. చైనాలో 83 వేలకు పైగా కరోనా కేసులుంటే ఒక్క మహారాష్ట్రలోనే ఆ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనాకు సెంటర్ పాయింట్‌గా మారింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సుమా రు 70 శాతం కేసులు బాంబేలోనే ఉన్నాయి. ముంబై తర్వాత చెన్నై, ఇండోర్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మొత్తంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలు కరోనా కేసులో టాప్-3లో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే 50 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ప్రభావం విస్తరిస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా లక్షణాల నేపథ్యంలో కేజ్రీవాల్‌ను ఎవ్వరితో కలవనివ్వడం లేదు. కేజ్రీవాల్ అధికారిక కార్యకలాపాలను కూడా రద్దు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారి కూడా కరోనా బారినపడ్డారు. దాంతో ఆయన కార్యాలయాన్ని మూసివేశారు. ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించడంతో పాటు ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. ఇప్పటికే నీతి ఆయోగ్ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆఫీసును మూసివేసి శానిటైజ్ చేసిన అనంతరం తిరిగి తెరిచారు. జాతీయ మీడియా కేంద్రానికి కూడా కరోనా సోకింది. పీఐబీ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కేఎస్ థాట్ వాలియాకు వైరస్ అంటుకుంది. దాంతో పీఐబీ ఆఫీసును మూసివేశారు.

లాక్ డౌన్ సడలింపులతో దేశవ్యాప్తంగా జనజీవనం మళ్లీ గాడిలో పడుతోంది. ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు కూడా తెరుచుకోవడంతో రోడ్లపై రద్దీ పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందున్న పరిస్థితే మళ్లీ వీధుల్లో కనిపిస్తోంది. అన్ని మందిరాలు తెరుచుకోవడంతో మొదటి రోజు భక్తులతో కిటకిటలాడిపోయాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామైంది. హరియాణ, యూపీ నుంచి ఢిల్లీకి వస్తున్న హైవేలపై ప్రమాదాలు జరిగాయి.

Tags

Next Story