ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు తిప్పడంపై సీఎం కీలక నిర్ణయం

ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు తిప్పడంపై సీఎం కీలక నిర్ణయం

లాక్‌డౌన్‌ మినహాయింపుల నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రంలోనే బస్సులను నడుపుతున్న తెలంగాణ ఆర్టీసీ.. ఇకపై ఇతర రాష్ట్రాలకూ సర్వీసులు తిప్పనుంది. ఆర్టీసీపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసుల నిర్వహణకు పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. దీనికోసం అక్కడి ప్రభుత్వాలతో చర్చలు జరిపే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అప్పగించారు. ఆయా రాష్ట్రాల సీఎ్‌సలు, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్‌ ఇవాళ్టి నుంచి చర్చిస్తారు.ఎప్పటినుంచి సర్వీసులను ప్రారంభించాలి? ఎన్నింటిని తిప్పాలి? అన్నదానిపై చర్చిస్తారు.

టీఎస్ ఆర్టీసీ గతంలో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసాకు 1,184 సర్వీసులను తిప్పేది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కే 698 బస్సులను నడిపేది. మిగతా 486 బస్సుల్లో ఒడిశా, తమిళనాడుకు ఐదారు చొప్పున మినహా అన్నీ కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు సాగించేవే. అంతర్రాష్ట్ర సర్వీసుల పునఃప్రారంభం సందర్భంగా ‘రూట్‌ టు రూట్‌’ పద్ధతిన బస్‌ సర్వీసులు నడుపుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. దీని ప్రకారం ఏపీ నుంచి ఏ రూట్‌లో ఎన్ని బస్సులను నడుపుతారో.. అదే రూట్‌లో అన్నే బస్సులను తెలంగాణ తిప్పుతుంది. ఈ మేరకు అవగాహన కుదుర్చుకోవాలని కేసీఆర్‌ నిర్దేశించారు. ముందుగా ఏపీ, కర్ణాటకతో సీఎస్‌ చర్చిస్తారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఏపీ ఇప్పటికే లేఖ రాసినందున వారితో మాట్లాడి విజయవాడ, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వంటి నగరాలకు బస్సులను నడిపేందుకు ప్రయత్నిస్తారు. తర్వాత కర్ణాటకలోని బెంగళూరు, యాద్గిర్‌, రాయచూర్‌, బీదర్‌ వంటి రూట్లపై ఆ రాష్ట్రంతో చర్చిస్తారు. ఈ ఒప్పందాలు పూర్తయినప్పటి నుంచే అంటే.. మూడు, నాలుగు రోజుల్లోనే ఏపీకి సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులు తప్పకుండా కొవిడ్‌-19 మార్గదర్శకాలను పాటించాలన్న నిబంధన పెట్టనున్నారు. సాధారణంగా గరుడ, గరుడ ప్లస్‌, రాజధాని, సూపర్‌ లగ్జరీ బస్సులే ఇతర రాష్ర్టాలకు వెళ్తుంటాయి. ఇరువైపులా రెండేసి సీట్లుండే వీటిలో పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

మరోవైపు కరోనా వ్యాప్తి ప్రమాదం ఉండటంతో హైదరాబాద్‌, వరంగల్‌లో సిటీ బస్సులు ఇప్పుడే నడపొద్దన్న నిర్ణయానికి వచ్చారు. సిటీ బస్సులకు డోర్లు ఉండవని, భౌతిక దూరం నిబంధన అమలు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జిల్లా సర్వీసుల మాదిరిగా తక్కువ మందిని ఎక్కించుకోవడమూ సాధ్యం కాదని అధికారులు వివరించారు. ప్రయాణికులు మాస్కులు ధరిస్తారన్న గ్యారంటీ లేదని చెప్పారు. దీంతో సిటీ సర్వీసులను అనుమతించకపోవడం మంచిదనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story