తెలంగాణలో 3920కి చేరిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కొత్తగా 178 కేసులు నిర్ధారణ అయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3920కి చేరింది. తాజాగా తెలంగాణలో కరోనాతో ఆరుగురు మరణించారు.. మొత్తం మరణాల సంఖ్య 148కి చేరింది.. ఇప్పటి వరకు 1742 మందిని డిశ్చార్జ్ చేయగా, 2030 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఎక్కువ భాగం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 143 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.. మహబూబ్‌నగర్‌లో రెండు, సంగారెడ్డిలో రెండు, మెదక్‌లో రెండు కేసులు నమోదు కాగా.. జగిత్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
లాక్ డౌన్ సడలింపుల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. గత నెల 16 నుంచి లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం కొద్దికొద్దిగా సడలిస్తూ వచ్చింది.. ఈ నేపథ్యంలో జనం బయట తిరిగేందుకు వెసులుబాటు లభించింది.. అటు వలస కార్మికులతోపాటు అంతర్ జిల్లాల బస్సు సర్వీసులు కూడా పెరగడంతో జిల్లాల్లో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. గతంలో ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మాస్కులు లేకుండా బయటకు రావద్దని హెచ్చరిస్తున్నా జనం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కరోనా బారిన పడకుండా కేంద్రం సూచించిన నిబంధనలను పాటించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రజల్లో అభద్రతాభావం, భయం పెరుగుతుందన్నారు. ఈ భయాన్ని తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని లేఖలో ప్రస్తావించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాలని కోరారు కిషన్‌రెడ్డి. ఇంటింటి సర్వే అమలు పరిచి సకాలంలో రోగులను గుర్తించి చికిత్స అందజేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగాన్ని వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తూ, కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలను అమలు పర్చాలని లేఖలో కోరారు కిషన్‌రెడ్డి.
గ్రేటర్‌పై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఎవరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందో అన్న భయం అందరిలో నెలకొంది. అలాగే కాంటాక్టు లను గుర్తించడం కూడా కష్టంగా మారింది. గతవారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నవెూదవుతూనే ఉన్నాయి. చివరకు జిహెచ్‌ఎంసి, సచివాలయ ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో అందరిలో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..... తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

