అస్సాం ఆయిల్ బావిలో భారీ అగ్నిప్రమాదం

అస్సాంలో ఓ ఆయిల్ బావిలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన టిన్సుకియా జిల్లాలోని బాగజన్‌లోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో జరిగింది. దీంతో సమీపంలోని 30 కి పైగా ఇళ్లను పొగలు ముంచెత్తాయి. ఇళ్లన్నీ పొగతో నిండిపోయాయి. దాంతో రంగంలోకి దిగిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్), అగ్నిమాపక దళం మంటలను అదుపుచేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ 3 వేలకు పైగా ప్రజలను సమీప ప్రాంతాల నుండి తరలించారు.
ఇదిలావుండగా, ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఘటనపై ఆరాతీశారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోను మాట్లాడారు. మంటలను అదుపు చేయడానికి సైన్యం, వైమానిక దళం సహాయం కోరినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఇందుకు అవసరమైన సహాయం చేస్తామని రక్షణ మంత్రి హామీ ఇచ్చారు.
కాగా గత 14 రోజులుగా బావి నుంచి గ్యాస్ లీక్ అవుతోందని ఒక అధికారి తెలిపారు. అయితే మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని మంటలను ఆర్పడానికి నిపుణులను కూడా రప్పించినట్టు తెలిపారు. ఇందులో సింగపూర్ అలర్ట్ డిజాస్టర్ కంట్రోల్‌కు చెందిన ముగ్గురు నిపుణులు పాల్గొన్నారు. ఇక ఈ సంఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కంపెనీ అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

