అమ్మాయిలకు వీడియో కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న సైకో అరెస్ట్..

అమ్మాయిలకు వీడియో కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న సైకో అరెస్ట్..

అమ్మాయిలు, యువతులను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న సైకోను నల్లగొండ షీ టీమ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని అఖిల్‌గా గుర్తించిన పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో అఖిల్ అరాచకాలు బయటకొచ్చాయి. అఖిల్‌పై జనగామా, సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్, నల్లగొండ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అఖిల్‌.. సికింద్రాబాద్‌లోని ఓ హోమ్ కేర్ సెంటర్‌లో వార్డ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. అక్కడ నర్సులను బ్లాక్ మెయిల్ చేసి వేధించినట్లు ఆరోపణలున్నాయి. అఖిల్ లాంటి యువకుల విషయంలో యువతులు అలర్ట్‌గా ఉండాలని ఎస్పీ రంగనాథ్ సూచించారు. బాధిత యువతులకు షీ టీమ్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అఖిల్.. ఆన్‌లైన్ డేటింగ్‌లు, జల్సాలకు అలవాటుపడ్డాడు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు, యువతులకు వల విసిరేవాడు. వారికి వీడియో కాల్ చేయడం, వాళ్లు కాల్ లిఫ్ట్ చేయగానే రికార్డ్ చేసి స్క్రీన్ షాట్లు పెట్టుకునేవాడు. వాటిని చూపిస్తూ వారిని లైంగికంగా వేధించేవాడు. వీడియో కాల్స్ బయటపెడతానంటూ బెదిరించి కోరికలు తీర్చుకునేవాడు. అఖిల్ వలలో చాలా మంది యువతులు పడినట్లు సమాచారం. పోలీసుల విచారణలో అఖిల్ తన నేరాలను అంగీకరించినట్లు తెలుస్తోంది. కౌమార యువతుల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని షీటీమ్ ఇన్ఛార్జ్, ఏఎస్పీ నర్మద తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story