అమరావతిలో కీచక ఎస్సైపై సస్పెన్షన్ వేటు..

కీచక ఎస్సై రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు పడింది. అమరావతిలో ఒక లాడ్జిలో బస చేసిన జంటపట్ల ఎస్సై రామంజనేయులు, అతని ప్రైవేట్ డ్రైవర్ వ్యవహరించిన తీరుపై ఎస్పీ విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో ఆరోపణలు రుజువుకావడంతో.. ఇద్దరిపైనా కేసులు నమోదుచేసి అరెస్టు చేయనున్నారు. అరెస్టు చేస్తానంటూ బెదిరించి లాడ్జీలో ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు ఎస్సై రామాంజనేయులు. కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తుళ్లూరు డీఎస్పీకి ఫిర్యాదు చేసిందా బాధితురాలు. కేసుని సీరియస్‌గా పరిగణించిన పోలీసులు.. లాడ్జీలోని సీసీటీవీ దృశ్యాలు సేకరించారు. ఎస్సై 40 నిమిషాల పాటు లాడ్జిలో గడిపినట్లు నిర్ధారించుకున్నారు.
మిగతా పోలీసులంతా కరోనా విధుల్లో బిజీగా ఉంటే ఎస్సై రామాంజనేయులు మాత్రం విశ్రాంతి నెపంతో లాడ్జీలో తిష్టవేశాడు. లాక్‌డౌన్ సమయంలో లాడ్జీలో రౌడీ షీటర్లతో మందు, విందుల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం లాడ్జికి ఓ జంట వచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్సై స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ బెదిరింపులకు దిగాడు. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ యువతితో వచ్చిన యువకుడు.. డబ్బు కోసం ATMకు వెళ్లిన సమయంలో కోరిక తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఎదురుతిరగడంతో వదిలేశాడు ఎస్సై రామంజనేయులు. విషయం బయటకు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేధింపులు నిజమేనని తేలడంతో ఎస్సైని సస్పెండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

