జార్జ్ ఫ్లాయిడ్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన అమెరికా ప్రజలు

జార్జ్ ఫ్లాయిడ్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన అమెరికా ప్రజలు

జాత్యహంకారానికి బలైపోయిన జార్జ్ ఫ్లాయిడ్‌కు అమెరికా ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. స్వస్థలం హ్యూస్టన్‌లో ఫ్లాయిడ్‌ మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్ మృతదేహాన్ని ఖననం చేశారు. హ్యూస్టన్‌లోని ఓ చర్చిలో దాదాపు 5 వేల మంది ఫ్లాయిడ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. మండే ఎండలను తట్టుకుని ఆరుగంటల పాటు ఫ్లాయిడ్‌ శవపేటిక ముందు మౌనంగా నివాళి అర్పించారు. రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఫ్లాయిడ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. డెమోక్రాటిక్ పార్టీ నాయకుడు జో బిడెన్, హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్, నటులు జామీ ఫాక్స్, చాన్నింగ్ టాటమ్, హూస్టన్ పోలీస్ చీఫ్ ఆర్ట్ అసేవెడో, గ్రామీ విజేత నే-యో తదితరులు ఫ్లాయిడ్‌కు తుది వీడ్కోలు పలికారు. జాత్యహంకారాన్ని రూపుమాపడానికి, సమన్యాయం చేయడానికి సమయం ఆసన్నమైందని జో బిడెన్ పేర్కొన్నారు.

అంతకుముందు, ఫ్లాయిడ్ మృతదేహాన్ని హ్యూస్టన్‌లోని చర్చ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆరు రోజుల సంతాప దినాల తర్వాత 3 నగరాల్లో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రదర్శించారు. ఫ్లాయిడ్‌ పుట్టిన నార్త్ కరోలినాలోని రేఫోర్డ్‌, అతను పెరిగిన హ్యూస్టన్, అతను మరణించిన మిన్నియాపాలిస్ నగరాల్లో ప్రదర్శన కొనసాగింది. వేలాదిమంది నిరసనకారులు, ప్రజలు ఫ్లాయిడ్ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story