24 గంటల్లో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ అల్పపీడనం మరింత బలపడనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ అల్ప పీడనం ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు నైరుతీ రుతుపవనాలు ఇవాళ తెలంగాణతో పాటు..కోస్తాంధ్ర, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతోనే.. తెలంగాణ వ్యాప్తంగా ముందస్తు వర్షాలు కురుస్తున్నాయంది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం నగరాన్ని ముంచెత్తింది. బంజారాహిల్స్, కోఠి, అబిడ్స్, హిమాయత్‌నగర్, మెహదీపట్నం, లంగర్‌హౌస్, మూసాపేట తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు రోడ్లపై చెట్లు విరిగిపడటంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో గంటసేపు వర్షం ఆగకుండా కురవడంతో.. రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షపాతం నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

