మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో అన్ని డొల్ల లెక్కలే : టీడీపీ

అధికారంలోకి వచ్చి రాగానే టీడీపీ ప్రభుత్వం అవినీతి జరిగిందని నిరూపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే తొలుత అమరావతిపై ఫోకస్ చేసింది. కానీ, ఇప్పటికీ అవినీతి జరిగినట్లు నిర్ధారణకు రాలేకపోయింది. ఆ తర్వాత పోలవరంలో అవినీతి అంటూ బూతద్దంతో వెతికి చివరికి రివర్స్ టెండరింగ్ తో గప్ చుప్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో వాదనతో టీడీపీ పాలనలో అవినీతి జరిగిందని నిరూపించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఏపీ ఫైబర్ గ్రిడ్, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల సరఫరా ఇలా పలు పథకాల్లో అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్ నివేదిక అందించింది. అన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలన్న మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసిన నివేదికలో ఎక్కువగా ఫైబర్ గ్రిడ్ పై ఫోకస్ చేసింది. ఫైబర్ గ్రిడ్‌లో టెరా సాఫ్ట్‌వేర్, వేమూరి రవిప్రసాద్ కేంద్రంగా అవినీతి జరిగినట్లు సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. అర్హత లేని సంస్థలకు ప్రాజెక్ట్ కట్టబెట్టారని..దాదాపు 700 కోట్ల మేర అవినీతి జరిగిందని సబ్ కమిటీ ఆరోపించింది. సెటాప్ బాక్సుల కొనుగోళ్లలోనూ భారీ కుంభకోణం జరిగిందని తెలిపింది. అలాగే చంద్రన్న కానుకలో 158 కోట్ల అవినీతి జరిగిందని, ఇక మజ్జిగ ప్యాకెట్ల పేరుతో హెరిటేజ్ కు ఏడాదికి 40 కోట్లు కట్టబెట్టారంటూ నివేదించింది.
అయితే..ప్రభుత్వ ఆరోపణలపై ప్రతిసారి తరహాలోనే ఈ సారి కూడా టీడీపీ ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. అమరావతి, పోలవరంలో అవినీతి జరిగిందనే ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలంటూ ప్రభుత్వానికి ప్రతిసారి సవాల్ విసిరిన టీడీపీ..మంత్రివర్గ ఉపసంఘం నివేదికలోనూ అన్ని డొల్ల లెక్కలే ఉన్నాయని అంటోంది. మజ్జిగ ప్యాకెట్ల పేరుతో హెరిటేజ్ కు అప్పటి ప్రభుత్వం ఏడాదికి 40 కోట్లు కేటాయించిందనే ఆరోపణలు కొట్టిపారేసింది. వాస్తవ లెక్కలు ఇదిగో చూడండి అంటూ ప్రభుత్వం, ప్రజలకు అర్ధం అయ్యేలా బహిరంగ లేఖ విడుదల చేసింది. 2015- 16 నుంచి 2019- 20 సంవత్సరాల మధ్య తమ సంస్థ కేవలం 1.49 కోట్ల రూపాయల విలువైన మజ్జిగను మాత్రమే పలు దేవాలయాలకు సరఫరా చేసిందని హెరిటేజ్ ఫుడ్స్ బహిరంగ లేఖలో వెల్లడించింది.
ఇతర కంపెనీలతో పోటీపడి అత్యంత పారదర్శకంగా టెండర్ల ద్వారా ఆర్డర్లు చేజిక్కించుకున్నట్టు తెలిపింది. మొత్తం మజ్జిగ ఆర్డర్ ను ఏ ఒక్క కంపెనీకి పూర్తిగా ఇవ్వలేదని... పేరుమోసిన కంపెనీలతో పోటీపడి టెండర్లను గెలుచుకున్నామని స్పష్టం చేసింది. అలాగే ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ M.C.D.E.X ప్లాట్ ఫామ్ ద్వారా నిర్వహించిన టెండర్లలో పాల్గొని 21.19 కోట్ల రూపాయల మేర నెయ్యి సరఫరా ఆర్డర్ దక్కించుకున్నట్లు సంస్థ వివరించింది. పారదర్శకంగా అన్ని ఇతర కంపెనీలతో పోటీపడి టెండర్ల ద్వారా 100 మిల్లీ లీటర్ల నెయ్యి పొట్లాల ఆర్డర్లు దక్కించుకున్నామని.. ఇందులో భాగంగా కొన్ని జిల్లాలకు మాత్రమే తాము సరఫరా చేయగా.. ఇతర జిల్లాలకు మిగతా కంపెనీలు సరఫరా చేశాయని సంస్థ గుర్తు చేసింది.
హెరిటేజ్ ఫుడ్స్ 28 ఏళ్లుగా నైతిక విలువలకు, అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి వ్యాపారం చేస్తోందని సంస్థ వెల్లడించింది. మీడియాలో ప్రచురితమయ్యే సత్యదూరమైన వార్తలతో హెరిటేజ్ ఫుడ్స్ ను నమ్ముకున్న లక్షలాది మంది రైతుల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచారంలోకి తేవడం రైతాంగానికి నష్టం కలిగిస్తుందని హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

