హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు సమాలోచనలు..

హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు సమాలోచనలు..

కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల తీవ్రతతో పాటు నిరుద్యోగం కూడా అదే స్థాయిలో ఉంది. దీంతో తమ దేశ పౌరులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఉపాధి నిమిత్తం తమ దేశానికి వచ్చేందుకు తీసుకునే వీసాలను కొంత కాలం పాటు నిలిపి వేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ట్రంప్ తీసుకునే నిర్ణయం ప్రభావం అధికంగా ఉంటుంది. ఇప్పటికే కరోనా కారణంగా చాలా మంది హెచ్-1బీ వీసాదారులు ఉద్యోగాలు కోల్పోయి భారత్ తిరిగొచ్చారు. మళ్లీ వీళ్లు తిరిగి వెళ్లాలన్నా, కొత్తగా అమెరికాలో ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్నా ఇప్పుడప్పుడే సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ అంశంపై స్పందించిన వైట్ హౌస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. అమెరికా పౌరుల ఉపాధిని రక్షించేందుకు నిపుణులు అనేక మార్గాలు సూచించారని, వాటన్నింటినీ పరిశీలించిన మీదట తుది నిర్ణయం తెలియజేస్తామని వైట్ హౌస్ అధికార ప్రతినిధి హోగన్ గిడ్లే తెలిపారు. హెచ్-1బీ, హెచ్-2బీ, జే-1, ఎల్-1 వీసాలను కూడా నిలిపివేయాలనుకుంటున్న జాబితాలో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే అమెరికా ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్ధంగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణుల అవసరం కంపెనీలకు ఉందని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో థామస్ డోనో స్పష్టం చేశారు. ఉద్యోగ ఉపాధి వీసాలను రద్దు చేస్తే అమెరికా ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈమేరకు అధ్యక్షుడు ట్రంప్ కు రాసిన లేఖలో ఆయన వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story