అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టైన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు జడ్జి... 14 రోజుల రిమాండ్ విధించారు. అనారోగ్యం దృష్ట్యా ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు. ఏసీబీ అధికారులు విజయవాడ సబ్ జైలుకు ఆయన్ను తరలించారు. జైలు అధికారుల అనుమతి అనంతరం ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేసుకున్న విషయం న్యాయమూర్తికి తెలిపామన్నారు ఆయన తరపు న్యాయవాధి. ఆస్పత్రిలో ఉంచాలని వైద్యులు సూచించారని జడ్జి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారాయన. దీంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి, అందించే వైద్యం గురించి కోర్టుకు నివేదిక ఇవ్వాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.
మరోవైపు... అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఏసీబీ కోర్టుకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించారు లోకేష్. కానీ, ఆయన్ను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. కరోనా పరిస్థితుల్లో అచ్చెన్నాయుడ్ని కలిసేందుకు అనుమతించబోమని లోకేష్ తో వాగ్వాదానికి దిగారు. అయితే..తాము అచ్చెన్నాయుడ్ని కలిసే వరకు వెళ్లేది లేదని లోకేష్‌తో పాటు ఇతర టీడీపీ నేతలుపట్టుబట్టారు. కానీ, కరోనా కారణం చూపించి పోలీసులు ఒత్తిడి చేయటంతో లోకేష్ తో పాటు ఇతర నేతలు అచ్చెన్నాయుడ్ని కలవకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
శుక్రవారం ఉదయం అత్యంత నాటకీయంగా ఆయన స్వగ్రామమైన నిమ్మాడలో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. భారీ సంఖ్యలో భద్రతబలగాలు ఇంటిని చుట్టుముట్టాయి. ఇంటి ప్రహరీ, ప్రధాన గేటు దూకి మరీ ఏసీబీ సిబ్బంది లోపలికి ప్రవేశించారు. అలా 7.10 గంటలకు ఇంట్లోకి వెళ్లిన ఏసీబీ బృందాలు.. ఆయన్ను అరెస్టు చేయడం.. పది నిమిషాల్లోనే ఊరు దాటించడం చకచకా జరిగిపోయాయి. ఈ అరెస్టు, ఆ తర్వాత ఏసీబీ కోర్టుకు హజరుపర్చడం అర్ధరాత్రి వరకూ ఉత్కంఠభరితంగా కొనసాగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com