భారత్ లో 3లక్షల మార్కును దాటేసిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య 3లక్షల మార్కును దాటేసింది. ప్రస్తుతం 3 లక్షల పదివేల కేసుల దిశగా సాగుతోంది. కొత్త కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం కేసుల సంఖ్య 3,09,500 పెరిగింది. మరోవైపు, దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ లక్షకు పైగా కేసులతో తొలి స్థానంలో నిలిచింది. తమిళనాడు 40,698 కేసులు, దిల్లీ 34,687 కేసులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలో కరోనా వైరస్ అత్యధికంగా ప్రభావితం చేస్తున్న టాప్ 10 దేశాల్లో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. నిన్న ఒక్క రోజే అత్యధికంగా 388 మంది మృత్యువాత పడటంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 8,890 చేరుకుంది...
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,493 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. దేశంలో ఇలా లక్ష కరోనా కేసులు నమోదైన తొలి రాష్ట్రం మహారాష్ట్రనే. కొత్తగా 127 మంది మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 3717కి పెరిగింది. మరోవైపు, ఒక్కరోజే 1718 మంది కోలుకొని డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో డిశ్చార్జైన వారి సంఖ్య 47వేల 793కి పెరిగింది. ఒక్క ముంబైలోనే 1366 పాజిటివ్ కేసులు, 90 కొత్త మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య 55,451కి పెరగ్గా.. 2044 మంది మృత్యువాతపడ్డారు.
అటు తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. నిన్న ఒక్క రోజే... దాదాపు రెండువేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 40 వేలు దాటింది. ఇక కరోనాతో 18 మంది చనిపోవడంతో.. మొత్తం మృతుల సంఖ్య 367కు చేరింది. ఇక..ఢిల్లీలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక్కడ శుక్రవారం ఒక్కరోజే 2,137 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఒక్కరోజులో 2వేలపైగా కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 36,824కు చేరింది. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు 1,214మంది బలయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో 22,212 యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు... దేశంలో కరోనాతో పోరాడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 1,47,195 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీ శాతం 49.47శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కన్నా కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉండటం కొంత ఉపశమనం కలిగించే విషయం.
రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ నెల 16, 17 తేదీల్లో కరోనా వైరస్ వ్యాప్తికి గల కారణాలపై సీఎంలతో ప్రధాని మోదీ చర్చించనున్నారు. జూన్ 16వ తేదీన పంజాబ్, అస్సాం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లడఖ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తారు. ఈ నెల 17న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల సీఎంలతో మోదీ చర్చిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com