అవినీతిపరుడికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది : చంద్రబాబు

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అరెస్టుపై స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఒక అవినీతిపరుడు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేర స్వభావి చేతికి అధికారం వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడం అన్నది ఫ్యాక్షనిస్టుల స్వభావం అన్న చంద్రబాబు.. ఇప్పుడు చేస్తున్నది కూడా ఇదేనని అన్నారు. నిన్న బీసీ నేత అచ్చెన్నాయుడు ఇంటి గోడలుదూకి మరీ వెళ్ళిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసారు.
ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేసారు. ప్రలోభాలకు లొంగని తెలుగుదేశం నేతలను ఇలా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పరిపాలనలో ఘోరంగా విఫలమై ప్రజల దృష్టిని మరల్చడానికి పాలకులు చేస్తున్న అరాచకాలను అందరూ అడ్డుకోవాలి. లేదంటే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com