అచ్చెన్నాయుడు అరెస్ట్‌ ను తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ

అచ్చెన్నాయుడు అరెస్ట్‌ ను తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ
X

మొన్నటి వరకు టీడీపీపై అవినీతి ఆరోపణలు చేసిన అధికార పార్టీ..ఇక ఇప్పుడు అరెస్టుల పర్వానికి తెరతీసింది. తొలి నుంచి ప్రతిపక్షం పట్ల పగసాధింపు ధోరణిలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అచ్చెన్నాయుడు అరెస్ట్ కేవలం ట్రైలర్‌ మాత్రమే ఆంటూ తమ ఉద్దేశాన్ని బహరింగంగానే చెప్పుకుంటోంది. అయితే..టీడీపీ కూడా అధికార పార్టీ రాజకీయ రాక్షసత్వంపై గళం వినిపించింది. అచ్చెన్నాయుడు అరెస్ట్‌ ను తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాదు..ఆయన్ను అరెస్ట్ చేసిన తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అరెస్ట్ ముందు చెప్పి అచ్చెన్నాయుడ్ని తీసుకెళ్లారని టీడీపీ ఆరోపిస్తోంది.

ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున మాట్లాడటమే అచ్చెన్నాయుడు చేసిన తప్పా అని ప్రశ్నించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. అచ్చెన్నాయుడిని కక్ష పూరితంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. తమ కుటుంబానికి అవినీతి మచ్చ లేదని, అక్రమ అరెస్ట్‌లతో బలమైన గొంతుకలను అణచివేయలేరని అన్నారు రామ్మోహన్‌ నాయుడు. సీఎం జగన్ బీసీలకు అన్యాయం చేయడానికి సిద్ధపడ్డారని.. బీసీల ఆగ్రహం ఎలావుంటుందో చూపిస్తామని హెచ్చరించారు

మాజీ మంత్రి, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని ఈ తరహాలో దారుణంగా అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు పితాని సత్యనారాయణ. గతంలో తాను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కొన్ని అవకతవకలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. తనకు క్లీన్ చిట్‌ వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత పరిణామాల్లో విచారణ పూర్తికాకుండా కక్షతో అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో TDPని ఎదుర్కోలేకే ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందన్నారు.

అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత. ఇలాంటి ఒత్తిళ్లకు తాము భయపడేది లేదన్నారు. ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసినట్లు తీసుకెళ్లారంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అనిత.

ఓ నిబద్ధతగల ప్రతిపక్ష నాయకుడిని.. అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు.. టీడీపీ సీనియర్ నేతలు. ఇది తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రయత్నమని అన్నారు.

అటు బీజేపీ కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగుతోందని... కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆమె దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు అరెస్టును ప్రస్తావిస్తూ... రుజువులను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజావేదికను కూల్చేసిన ప్రభుత్వం... దాని చుట్టూ ఉన్న అనధికార కట్టడాల జోలికి వెళ్లకపోవడం ప్రజల అసహనానికి గురి చేస్తోందన్నారు.

అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి టీడీపీ పతనమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం తీరును ప్రతిపక్ష పార్టీలన్ని కడిగిపారేశాయి. ప్రజల సంక్షేమం కంటే కక్ష సాధింపు రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి సారించాలరంటూ అధికార పార్టీపై మండిపడ్డాయి.

Tags

Next Story