నువ్విచ్చిన కానుక నాకెంతో అపురూపం.. జాగ్రత్తగా చూసుకుంటా

కరోనా వైరస్ గురించి హెచ్చరించిన కంటి డాక్టర్ లీ వెన్లియాంగ్ కరోనా కాటుకు బలై ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణానంతరం రెండవ బిడ్డకు జన్మనిచ్చింది లీ భార్య. చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వీచాట్ లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. నువ్వు నాకిచ్చిన చివరి బహుమతి ఈ రోజు ప్రాణం పోసుకుంది. ఈ బహుమతిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. స్వర్గం నుంచి నువ్వు నీ బిడ్డను చూస్తున్నావా అని రాశారు.
వూహాన్ నగరంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో స్థానిక వైద్యుడైన వెన్లియాంగ్ సహచరులను ఈ మహమ్మారి గురించి హెచ్చరించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో సైతం కరోనా వైరస్ గురించి పోస్ట్ చేశారు. అతడు పని చేస్తున్న ఆస్పత్రిలోనే డిసెంబర్ లో ఏడుగురు వైరల్ ఇన్ఫెక్షన్ తో చేరారు. 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ తరహా వ్యాధి లక్షణాలు వీరిలో కూడా ఉన్నాయని వెన్లియాంగ్ కు అనుమానం వచ్చింది.
సార్స్ కూడా కరోనా వైరస్ కుటుంబానికి చెందినదే అని తన సహచరులను హెచ్చరిస్తూ డిసెంబర్ 30న మెసేజ్ పెట్టారు. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్ లు ధరించమని సూచించారు. అయితే ఈ విషయం గురించి బయటకు మాట్లాడొద్దని ఆయనను పోలీసులు హెచ్చరించారు. చివరకు లీ కరోనా వ్యాధితో ఫిబ్రవరిలో మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com