నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: ఖుష్బూ

ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో మానసిక వేదనకు గురవుతారు. వాటిని అధిగమించిన వారే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించగలుగుతారు. ఆ ఒక్క సెకను ఆ ఆలోచనను విరమించుకుంటే సుశాంత్ విషయంలో ఇంత అనర్ధం జరగి ఉండేది కాదు అని నటి ఖుష్బూ ట్విట్టర్ వేదికగా తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు. తానూ ఒకప్పుడు తీవ్రమైన మానసిక వేదన అనుభవించానని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అన్నారు. సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె ట్విట్టర్ లో స్పందించారు.
ప్రతి ఒక్కరి జీవితంలో క్లిష్టమైన సమస్యలు ఉంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో నా జీవితం స్థంభించిపోయింది. చీకట్లో ఉన్నట్లనిపించింది. ఈ సమస్యల్ని భరించడం కంటే బ్రతుకుని బలి చేసుకోవడమే మంచిదనిపించింది. కానీ నాలోని ధైర్యం నన్ను ఆ ఆలోచన నుంచి వెనక్కి లాగింది. నన్ను మానసిక ఇబ్బందికి గురిచేస్తున్న వాటి గురించి నా విలువైన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలని అనుకున్నా. నా జీవితంలో ఒక ఆశ కోసం ఒక అవకాశం కోసం ఎదురు చూశా.
కాలక్రమంలో అవన్నీ సమసి పోయి ఇప్పుడు నేనెంతో సంతోషంగా ఉన్నానని ఖుష్బూ చెప్పారు. పోరాడే శక్తి ఉంది కాబట్టే ఇంత దూరం రాగలిగానని, పరాజయాలను విజయాలుగా మార్చుకుని ముందుకు సాగాలని అన్నారు. అంతేకాని ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. నిండు జీవితాలను బలి చేసుకుని మిమ్మల్ని ప్రేమించే వారి కన్నీళ్లకు కారణం కావద్దని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com